Kanguva Sizzle Teaser: అబ్బుపరిచేలా కంగువ టీజర్.. సూర్య విశ్వరూపం
Kanguva Movie Sizzle Teaser: కంగువ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. డిఫరెంట్ గెటప్‍లో సూర్య విశ్వరూపం చూపించారు.
Kanguva Sizzle Teaser: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న కంగువ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇలా ప్రతీ విషయంలోనూ ఈ మూవీ సినీ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తూ వచ్చింది. ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సూర్య డిఫరెంట్ గెటప్‍లో యోధుడిగా నటిస్తున్నారు. కాగా, కంగువ చిత్రం నుంచి నేడు (మార్చి 19) టీజర్ విడుదలైంది. హైప్‍ను నిలబెట్టుకుంటూ ఈ సిజిల్ టీజర్ అద్భుతంగా ఉంది.
టీజర్ ఇలా..
కంగువ ప్రపంచం కోసం సిద్ధమవండి అంటూ ఈ టీజర్ మొదలైంది. సముద్ర తీరంలో జాతర జరుగుతున్న సెటప్‍తో ఓపెన్ అయింది. పులి ముందుండగా కత్తి తీసే షాట్ అదిరిపోయింది. శవాలను గుట్టగా పడేయడం.. తెగల మధ్య పోరాటం ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. సముద్రంపై ఓడలతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది.
లాంగ్ హెయిర్‌తో సూర్య ఇంటెన్స్ గెటప్‍తో ఉన్నారు. ఓ తెగకు నాయకుడిగా ఆయన ఉండనున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆయన కత్తితో తెగనరికే సీన్లు అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా క్రూరంగా భయంకరమైన పాత్ర చేస్తున్నట్టు అర్థమవుతోంది. సూర్య, సన్నీ ఎదురెదురుగా గట్టిగా అరిచే షాట్‍తో కంగువ టీజర్ ఎండ్ అయింది. అద్భుతమైన విజువల్స్, డైరెక్టర్ శివ టేకింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్, సూర్య, బాబీ డియోల్ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కంగువ టీజర్ అబ్బుపరిచేలా ఉంది.
దేవీ శ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కంగువ టీజర్లో గూజ్‍బంప్ తెప్పించేలా ఉంది. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ కూడా గ్రాండ్‍గా అనిపిస్తోంది. కొన్ని తెగల మధ్య ఆధిపత్యం కోసం చేసుకునే యుద్ధాల నేపథ్యంలో కంగువ రానుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.
కంగువ చిత్రంలో సూర్య, బాబీ డియోల్‍తో పాటు దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే, కోవై సరళ, ఆనంద్‍రాజ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆది నారాయణ కథ అందించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే, కంగువ సినిమా రిలీజ్ డేట్‍ను మేకర్స్ ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. ఈ ఏడాదే ఈ మూవీ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికీ తేదీ ఖరారు కాలేదు. పీఎఫ్‍ఎక్స్ భారీ స్థాయిలో ఉండటంతో ఈ చిత్రం ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది.
అమెజాన్ చేతికి ఓటీటీ హక్కులు
కంగువ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను కూడా ఖరారు చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. నేడు జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్‍లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీని స్ట్రీమింగ్ చేసుకునేందుకు ప్రైమ్ వీడియో డీల్ చేసుకుంది. కంగువ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.