Kalki 2898 AD Tickets Booking: గెట్ రెడీ: కల్కి 2898 ఏడీ టికెట్ల బుకింగ్ ఎప్పుడు షురూ కానుందంటే..
Kalki 2898 AD Tickets Booking: కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల బుకింగ్ షురూ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆన్‍లైన్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ కానున్నాయో సమాచారం బయటికి వచ్చింది.
Kalki 2898 AD: ఆకాశమంత అంచనాలు ఉన్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ ఫ్యుచరిస్టక్ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఉంది. టికెట్ల బుకింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల బుకింగ్స్ ఎప్పుడు మొదలుకానున్నాయో సమాచారం వెల్లడైంది.
బుకింగ్స్ మొదలు ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల ఆన్‍లైన్ బుకింగ్స్ నేటి (జూన్ 23) సాయంత్రం 6 గంటల సమయంలో మొదలుకానున్నాయనే సమాచారం బయటికి వచ్చింది. 6 గంటలకు ఆన్‍లైన్‍లో థియేటర్స్ టికెట్ల అమ్మకాలు షురూ కానున్నాయి. భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. 2డీతో పాటు 3డీ ఫార్మాట్‍లోనూ వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కల్కి 2898 ఏడీ సినిమా తొలి రోజు కలెక్షన్ల రికార్డును బద్దలుకొడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల్లో ఈ మూవీపై క్రేజ్ విపరీతంగా ఉండడం, టికెట్ల ధరల పెంపు ఎక్కువగా ఉండడం, భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల అవుతుండటంతో భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. బుకింగ్ మొదలైన కాసేపటికే చాలా థియేటర్లలో హౌస్‍పుల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
టికెట్ల ధరల పెంపు ఇలా..
కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‍లలో ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.70, మల్టీపెక్స్‌ల్లో అదనంగా రూ.100 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒక్కో టికెట్ ధర మల్టీప్లెక్స్‌ల్లో గరిష్టంగా రూ.413, సింగిల్ స్క్రీన్‍లలో రూ.377కు చేరింది. తొలి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాల షోకు కూడా అనుమతి లభించింది. 8 రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ దక్కింది. కల్కి మూవీకి ఆంధ్రప్రదేశ్‍లోనూ ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.100 ధర పెరుగుతుందని తెలుస్తోంది. ఐదు షోలకు కూడా అనుమతి దక్కడం ఖాయమే.
కల్కి 2898 ఏడీ నుంచి ఇటీవల వచ్చిన రెండో ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో భైరవ పాత్ర పోషించారు హీరో ప్రభాస్. అశ్వత్థామ పాత్ర చేశారు అమితాబ్ బచ్చన్. కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, సస్వత ఛటర్జీ, శోభన కీలకపాత్రలు పోషించారు. మరికొందరు స్టార్ నటీనటుల క్యామియో రోల్స్ ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.
కల్కి 2898 ఏడీ చిత్రాన్ని భారత పురాణాల స్ఫూర్తితో సైన్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ కథ రాసేందుకు తన ఐదేళ్ల సమయం పట్టిందని ఇటీవలే తెలిపారు. భారీ బడ్జెట్‍తో ఈ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల బిజినెస్ సుమారు రు.400 కోట్ల వరకు జరిగిందని సమాచారం బయటికి వచ్చింది.
టాపిక్