Kalki Ticket Rates: ప్రభాస్ కల్కి టికెట్ రేట్ల పెంపు - తెలంగాణ, ఏపీలో ఎంత పెరిగాయంటే! - బెనిఫిట్ షోలకు అనుమతి
Kalki Ticket Rates: కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. కల్కి టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ 100, మల్టీప్లెక్స్‌లో 75 రూపాయలు పెరిగాయి. ఏపీలో కల్కి టికెట్ ధరలు వంద రూపాయలు పెరిగినట్లు సమాచారం.
Kalki Ticket Rates: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల రేట్లు పెరిగాయి. తెలంగాణతో పాటు ఏపీలో టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేశాయి. ఈ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవోను జారీ చేసింది. తెలంగాణలో కల్కి టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో 100, మల్టీప్లెక్స్‌లో 75 వరకు పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
పెరిగిన టికెట్ ధరలతో కలిసి కల్కి మూవీకి సింగిల్ స్క్రీన్‌లో 265, మల్టీప్లెక్స్‌లో 413గా కల్కి టికెట్ రేట్లు ఉండనున్నాయి. ఈ ధరలతో పాటు టాక్స్‌లను అదనంగా వసూలు చేయబోతున్నారు. .టికెట్ ధరలతో పాటు కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించి ఆరో షో (ఉదయం ఐదున్నర గంటలకు), బెనిఫిట్ షోలను స్క్రీనింగ్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
బెనిఫిట్ షోలకు...
ఈ బెనిఫిట్ షో టికెట్ ధరలను జీవోలో వెల్లడించింది. బెనిఫిట్ షోస్‌కు సింగిల్ స్క్రీన్‌లో 377, మల్టీప్లెక్స్‌లో 495గా టికెట్ ధరలు ఉండనున్నాయి. ఫస్ట్ వీక్ మొత్తం పెరిగిన ధరలతోనే కల్కి మూవీ స్క్రీనింగ్ ఉండబోతున్నట్లు సమాచారం. జూన్ 27 నుంచి జూలై నాలుగు వరకు ఈ టికెట్ ధరలు అమలులో ఉండనున్నాయి.
ఏపీలో వంద...
ఏపీలో కల్కి 2898 ఏడీ టికెట్ ధరలను పెంచేందుకు టీడీపీ, జనసేన ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సింగిల్‌స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో వంద రూపాయలను పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన జీవో సోమవారం జారీ కానున్నట్లు తెలిసింది.
అడ్వాన్స్ బుకింగ్స్...
ఏపీ టికెట్ రేట్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీకాగానే తెలుగు రాష్ట్రాల్లో కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణలో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో రిలీజ్‌కు వారం ముందే కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మిలియన్లు దాటేసింది. అతి తక్కువ టైమ్‌లో ఈ ఘనతను సాధించిన ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది.
ప్రభాస్ సూపర్ హీరో...
కల్కి మూవీలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. దీపికా పదుకోణ్. దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో విలక్షణ నటుడు కమల్ హాసన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మాళవికానాయర్, అన్నాబెన్, శోభన. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలు నాని, విజయ్‌దేవరకొండతో పాటు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గెస్ట్ పాత్రల్లో కనిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సెకండ్ ట్రైలర్‌కు 12 మిలియన్ల వ్యూస్...
దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వనీదత్ కల్కి 2898 ఏడీ మూవీని నిర్మించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా కల్కి నిలిచింది. కల్కి మూవీ సెకండ్ ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సెకండ్ ట్రైలర్‌కు ఇరవై నాలుగు గంటల్లో 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.