Kajal Aggarwal: మా ఆయన ఆ ఇద్దరు హీరోయిన్లకు పెద్ద అభిమాని: కాజల్ కామెంట్స్ వైరల్
Kajal Aggarwal: సత్యభామగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కాజల్ అగర్వాల్ తన భర్త ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో చెప్పింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ తెలుగులో ఎంతో మందికి అభిమాన హీరోయిన్. టాలీవుడ్ చందమామగా పేరుగాంచిన ఆమె అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరు. అలాంటిది ఆమె భర్త మాత్రం ఆమెకు కాకుండా మరో టాలీవుడ్ హీరోయిన్ కు వీరాభిమాని అట. ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లంటే తన భర్త గౌతమ్ కు ఇష్టమని కాజల్ చెప్పడం విశేషం.
కాజల్ భర్త ఫేవరెట్ హీరోయిన్లు వీళ్లే
కాజల్ భర్త గౌతమ్ ఫేవరెట్ హీరోయిన్లు ఎవరు? ఇదే ప్రశ్న ఆమెకు సత్యభామ ప్రమోషన్లలో భాగంగా ఎదురైంది. దీనికి ఆమె ఏం సమాధానం చెబుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే దక్షిణాదిలో తన భర్త సమంతకు వీరాభిమాని అని కాజల్ చెప్పింది. సమంతతోపాటు రాశీ ఖన్నా కూడా అతని ఫేవరెట్ హీరోయిన్లలో ఒకరు అని తెలిపింది.
నిజానికి కాజల్, సమంత కలిసి రెండు సినిమాల్లో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి బృందావనంలో నటించిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.. తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవంలోనూ నటించారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత కూడా సినిమాలతో బిజీ అయింది. తాజాగా సత్యభామ మూవీతో ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
కాజల్ ఇంకా ఏమన్నదంటే?
కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సత్యభామ మూవీ శుక్రవారం (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కాజల్ మాట్లాడింది.
"నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కానీ కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్‌గా అనిపిస్తాయి" అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.
"నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి" అని కాజల్ అగర్వాల్ అన్నారు.
సత్యభామ ట్రైలర్
సుమన్ చిక్కల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ మొదట్లోనే ఓ ప్రాణాన్ని కాపాడటానికి విఫలమై.. తర్వాత సస్పెన్షన్ కు గురైన సత్యభామను చూపించారు. అయినా ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకులను పట్టుకోవాలన్న కసి మాత్రం ఆమెలో రగులుతూనే ఉంటుంది. అది పీడకలా వెంటాడటం, మరోవైపు బాధితురాలి కుటుంబం నుంచి ఎదురయ్యే ఛీత్కారాలు ఆమెలో కసిని మరింత పెంచుతాయి.
ఆ మర్డర్ కేసును పరిష్కరించే క్రమంలో మరో హత్య కూడా జరుగుతుంది. వీటిని పరిష్కరించడానికి కేవలం మూడు రోజులే సమయం ఇస్తున్నట్లు పైన బాస్ నుంచి ఆదేశాలు వస్తాయి. మరి ఈ కేసును పరిష్కరించడానికి సత్యభామ ఏం చేయబోతోంది అన్నదే ఈ మూవీ స్టోరీ. ట్రైలర్ తోనే స్టోరీపై ఓ క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం మేకర్స్ చేశారు.