Jacqueline Fernandez: తెలుగులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ! - డైరెక్టర్ ఎవరంటే?
Jacqueline Fernandez: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ సినిమాకు పేపర్‌బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
Jacqueline Fernandez: ప్రభాస్ సోహో మూవీలో ఐటెంసాంగ్‌లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఈ బోల్డ్ సుందరి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పూర్తి భిన్నంగా డిఫరెంట్ పాయింట్‌తో జాక్వెలన్ ఫెర్నాండేజ్ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
పాన్ ఇండియన్ మూవీ...
పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
నయనతార స్థానంలో...
డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వం వహించనున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో తొలుత నయనతార హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరిగింది. నయన్‌కు దర్శకుడు జయశంకర్ కథ వినిపించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా నయనతార స్థానంలో ఈ మూవీలోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వచ్చినట్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి.
అనసూయతో ఆరి...
సంతోష్ శోభన్ హీరోగా సంపత్‌నంది నిర్మించిన పేపర్‌బాయ్ మూవీతో జయశంకర్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పేపర్ బాయ్ తర్వాత ఆరి పేరుతో ఓ మూవీని తెరకెక్కించాడు. అనసూయ, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వివాదాలతోనే పాపులర్…
కాగా బాలీవుడ్‌లో సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది జాక్వెలిన్ ఫెర్రాండేజ్. మర్డర్ 2, హౌజ్‌ఫుల్ 2, రేస్ 2తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో కనిపించింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. 2022లో ఏడు హిందీ సినిమాలు చేసిన జాక్వెలిన్ గత ఏడాది మాత్రం ఒకే ఒక సినిమాలో కనిపించింది.
అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన సెల్ఫీ మూవీలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేసింది.ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆమెకు ఒక్క అవకాశం రాలేదు. దాంతో సౌత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని జాక్వెలిన్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
చేజారిన తెలుగు మూవీ అవకాశం...
నాగార్జున ది ఘోస్ట్ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖరన్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో ఆమె ఇన్వాల్వ్‌మెంట్ ఉందని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. పలుమార్లు జాక్వెలిన్‌ను ప్రశ్నించారు. ఈ వివాదం కారణంగా ది ఘోస్ట్ సినిమా నుంచి ఆమెను దర్శకనిర్మాతలు తొలగించారు. జాక్వెలిన్ స్థానంలో సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మనీ లాండరింగ్ కేసులో ఇటీవలో జాక్వెలిన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.