AP High Court : పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, వైసీపీ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
AP High Court on Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు పేర్కొంది. వైసీపీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
AP High Court on Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విజయ్, జస్టిస్ కిరణ్మయి బెంచ్.. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ వేసిన పిటిషన్ పై తీర్పు వెలువరిచింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలో కలగచేసుకోలేమని హైకోర్టు చెప్పింది. అటువంటి వివాదాలు కేవలం ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే పరిష్కరించాలని చట్టం చెబుతోందని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్లకు చట్టరీత్యా ఉన్న ఇతర అవకాశాలు పొందటానికి హైకోర్టు అవకాశం కల్పించింది. వైసీపీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, వీరా రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంప్లీడ్ వేసిన టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ తరపున పదిరి రవితేజ, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎలక్షన్ కమిషన్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న కోర్టు తుది తీర్పు వెలువరిస్తూ వైసీపీ పిటిషన్ కొట్టివేసింది.
సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఫారం- 13ఏపై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీల్ లేకపోయినా పర్వాలేదని, అటెస్టిట్ అధికారి సంతకం ఉంటే చాలని ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నిక సంఘం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా సీఈవో ముకేష్ కుమార్ మీనా మే 25, 26 తేదీల్లో మెమోలు జారీ చేశారు. ఈ మెమోలను వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈసీ ఆదేశాలకు భిన్నంగా సీఈవో ఉత్తర్వులు ఉన్నాయని వాదించింది. అటెస్టేషన్ లేకపోతే అటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించాలని, కానీ సీఈవో ఉత్తర్వులు అందుకు భిన్నంగా ఉన్నాయని కోర్టుకు తెలిపింది. అయితే గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని, ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది.
ఈసీ వివరణ
పోస్టల్ బ్యాలెట్ మీద ఏపీ ఎన్నికల సంఘం మే 25న జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరణ నేపథ్యంలో మే 25న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. గత ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సీఈసీ కార్యాలయం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ నియమించిన అధికారి సంతకం చేస్తే సరిపోతుందని వివరణ ఇచ్చింది. అటెస్టేషన్ అధికారి నియామకం ఆర్వో ద్వారా చేసినందున స్పెసిమెన్ సంతకాల సేకరణ అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో పోస్టల్ బ్యాలెట్ వేర్వేరు ప్రదేశాల్లో జరిగేది. ఈ ఏడాది ప్రతి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వేయడానికి ఈసీ ఏర్పాట్లు చేసింది. ఈసీ నియమించిన అధికారులే సంతకాలు చేసారు. హోదా రాయకున్న, స్టాంప్ వేయకున్నా అవి చెల్లుతాయి. ఈసీ వివరణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ మీద సందిగ్ధం తొలగిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావటంతో ఏపీ ఎన్నికల సంఘం మే 25న ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈసీ వివరణతో హైకోర్టు తీర్పు ఇచ్చింది.
సంబంధిత కథనం