AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం,మరో మూడ్రోజులు వానలు, ఎండల నుంచి ఉపశమనం
AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. మరో మూడ్రోజుల పాటు వానలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది.
AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండల నుంచి మరో మూడ్రోజుల పాటు ఉపశమనం లభించనుంది. ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక వద్ద ఆవర్తనం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ద్రోణి ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
గురువారం సాయంత్రం 6 గంటల వరకు కర్నూలు జిల్లా గూడూరులో 31.5మిమీ, కర్నూలు జిల్లా కొక్కరచేడులో 29మిమీ, కాకినాడ జిల్లా కృష్ణవరంలో 27.2మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 26.2మిమీ,బాపట్ల జిల్లా రేపల్లెలో 24.7మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 24.2మిమీ, మన్యం జిల్లా సాలూరులో 23.2మిమీ అధికవర్షపాతం నమోదైందన్నారు.
ఉత్తరాంథ్రలో వడగాలులు…
శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం సంతకవిటి, పార్వతీపురంమన్యం పాలకొండ మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.
గురువారం అనంతపురం జిల్లా మాలపురం, నంద్యాల జిల్లా నందవరంలో 39.9°C, కర్నూలు జిల్లా కోసిగిలో 39.8°C, తిరుపతి రూరల్లో 39.5°C, వైయస్ఆర్ జిల్లా బలపనూరులో 39.4°C, సత్యసాయి జిల్లా కనగానపల్లిలో 39.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో కూడా వానలే…
తెలంగాణలో ఈ నెల 10,11 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హనుమ కొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో నేడు రేపు వర్సాలు పడే అవకాశాలున్నాయి.
12వ తేదీ ఆదివారం తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమ కొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాలకు వర్షసూచనలు ఉన్నాయి. ఆదివారం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
13వ తేదీ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఈ నెల 13వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు అభ్యర్థుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
వాతావరణ శాఖ నేటి నుంచి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పోలింగ్ తగ్గుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. పోలింగ్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. రెండు రోజుల క్రితం కరీంనగర్‌లో గాలివానలతో సిఎం సభలు రద్దు చేయాల్సి వచ్చింది.