Hyper Adi on Ravi Teja: రవితేజ అలా చేయకపోతే ఆ సినిమాలు వచ్చేవి కావు.. ఆ డైరెక్టర్లు వచ్చేవారు కాదు: హైపర్ ఆది
Hyper Adi on Ravi Teja: హీరో రవితేజపై కమెడియన్ హైపర్ ఆది ప్రశంసల వర్షం కురిపించారు. రవితేజ వల్ల ఎంతో మంది డైరెక్టర్లు అయ్యారని చెప్పారు. మరిన్ని కామెంట్స్ చేశారు. ఆ వివరాలివే..
Hyper Adi on Ravi Teja: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈగల్ చిత్రం 2024 జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఓ ఈవెంట్ నిర్వహించింది. అలాగే, రవితేజకు బ్లాక్‍బాస్టర్ ఇచ్చిన ధమాకా సినిమాకు సంవత్సరం పూర్తయిన సెలెబ్రేషన్లను కూడా ఈ కార్యక్రమంలోనే కలిపేశారు. ఈగల్ ట్రైలర్ సక్సెస్ సెలెబ్రేషన్, ధమాకా వన్ ఇయర్ అంటూ ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజపై కమెడియన్ హైపర్ ఆది ప్రశంసల వర్షం కురిపించారు.
రవితేజ ప్రయోగాలు చేయకపోతే నా ఆటోగ్రాఫ్, నేనింతే లాంటి సినిమాలు వచ్చేవి కావని, కొందరు డైరెక్టర్లు కూడా వచ్చేవారు కారని హైపర్ ఆది అన్నారు. ఈ ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో రవితేజకు ప్రయోగాత్మక చిత్రాలు ఎందుకని, కమర్షియల్ మూవీస్ చేయాలనే కామెంట్లు ఇటీవల వినిపించాయి. వాటికి కౌంటర్‌గా ఆది తన మార్క్ స్పీచ్ ఇచ్చాడు. రవితేజ తన కెరీర్లో ప్రయోగాలు చేయడం వల్ల ఎంత మంచి జరిగిందో వివరించాడు.
“కొంతమంది.. అన్నా, ప్రయోగాలు వద్దు.. ఎంటర్‌టైన్‍మెంట్ మూవీస్ కావాలని రాస్తుంటారు. ఆయన ప్రయోగం చేయకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతీసారి నువ్వు స్టేటస్ పెట్టే నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీ వచ్చి ఉండేది కాదు. ఆయన ప్రయోగం చేయకపోతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడల్లా ఇన్‍స్పిరేషన్ కోసం చూసే నేనింతే లాంటి మూవీ వచ్చి ఉండేది కాదు. కొత్త వాళ్లతో ఎందుకులే అని ఆయన ప్రయోగం చేయకపోతే హరిశ్ శంకర్, బాబీ, మలినేని గోపీచంద్ లాంటి డైనమిక్ డైరెక్టర్లు వచ్చేవారు కాదు. అసలు ఆయనే ప్రయోగం చేయకపోతే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు.. అసిస్టెంట్లుగానే ఉండిపోయే వాళ్లు. చాలా మంది అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లు.. అసిస్టెంట్లుగానే ఉండిపోయే వారు” అని ఆది అన్నారు. రవితేజ ప్రయోగం ఉపయోగంగా మారిందే కానీ, ఎవరికీ ఏ నష్టం కలిగించలేదని అన్నారు.
కష్టాలు.. రిచ్ లైఫ్ రెండూ తెలుసు
రవితేజ అంటే ఒక తరాన్ని ఎంటర్‌టైన్ చేసిన వ్యక్తి మాత్రమే కాదని, స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అని ఆది ప్రశంసించారు. “ఆయనకు కృష్ణానగర్ కష్టాలు తెలుసు. జూబ్లిహిల్స్ రిచ్‍లైఫ్ తెలుసు. కింద ఉన్న వాళ్లను పైకి లాగడం తెలుసు. పైకి వచ్చిన వాడు ఎవడైనా పొగరుగా ఉంటే.. ఆ పొగరు దించడం కూడా తెలుసు. అలాంటి వ్యక్తి మా రవితేజ” అని ఆది అన్నారు.
కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా 2024 జనవరి 13న థియేటర్లలో రిలీజ్ కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వస్తోంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.
సంబంధిత కథనం