Nagarjuna: వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ: రిక్వెస్ట్ చేసిన హీరో నాగార్జున-do not believe rumours and speculations nagarjuna requests fans on n convention center demolition issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna: వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ: రిక్వెస్ట్ చేసిన హీరో నాగార్జున

Nagarjuna: వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ: రిక్వెస్ట్ చేసిన హీరో నాగార్జున

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 25, 2024 09:29 PM IST

Nagarjuna: హీరో నాగార్జునకు చెందిన ఎన్‍ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై చాలా విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో నాగార్జున స్పందించారు. అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు.

Nagarjuna: వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ: రిక్వెస్ట్ చేసిన హీరో నాగార్జున
Nagarjuna: వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ: రిక్వెస్ట్ చేసిన హీరో నాగార్జున

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‍ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని హైడ్రా కూల్చివేసింది. ఆ భవనాన్ని శనివారం (ఆగస్టు 24) పూర్తిగా నేలమట్టం చేసింది. తుమ్ముడికుంట చెరువును ఆక్రమించి.. ఎన్ కన్వెన్షన్‍‍ను నిర్మించారనే ఆరోపణలతో దీన్ని హైడ్రా ఇటీవలే కూల్చివేసింది. అయితే, ఈ విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. చాలా రూమర్లు వస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున మరోసారి స్పందించారు.

ఊహానాగాలు, పుకార్లే ఎక్కువ

ఎన్‍ కన్వెన్షన్ కూల్చివేతపై పుకార్లను నమ్మవద్దని తన అభిమానులు, శ్రేయోభిలాషులకు నాగార్జున సూచించారు. ఈ విషయంలో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వస్తున్నాయని నేడు (ఆగస్టు 25) ట్వీట్ చేశారు. తాము ఒక్క సెంట్ భూమి కూడా అక్రమంగా ఆక్రమించలేదని మరోసారి స్పష్టం చేశారు.

సెలెబ్రిటీలకు చెందిన విషయాల్లో ఊహాగానాలు, పెద్దగా చేసి చూపించడం ఎక్కువగా ఉంటాయని నాగార్జున పోస్ట్ చేశారు. పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టు మరోసారి క్లారిటీ ఇచ్చారు. “ఎన్ కన్వెన్షన్‍కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వస్తున్నాయి. పట్టా డాక్యుమెంటెడ్ స్థలంలోనే ఎన్‍-కన్వెన్షన్ నిర్మించాం. అదనంగా ఒక్క సెంట్ స్థలాన్ని కూడా ఆక్రమణ చేయలేదు” అని నాగార్జున ట్వీట్ చేశారు.

తాను ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, తీర్పునకు కట్టుబడి ఉంటానని నాగార్జున తెలిపారు. తాము తుమ్ముడికుంట చెరువు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించలేదని గతంలోనే ప్రత్యేక కోర్టు చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు. “హైకోర్టు ముందు మేం ఇప్పటికే వాదనలు వినిపించాం. చట్టాలను, తీర్పును నేను శిరసావహిస్తా. అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లను, తప్పుదోవ పట్టించే విషయాలను నమ్మవద్దని నేను కోరుతున్నా” అని నాగార్జున విజ్ఞప్తి చేశారు.

స్టే ఇచ్చిన కోర్టు

ఎన్‍ కన్వెన్షన్ సెంటర్‌ భవనాన్ని హైడ్రా పూర్తిగా కూల్చివేసింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టును నాగార్జున ఆశ్రయించారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా చర్యలకు దిగినట్టు హౌజ్ మోషన్ పిటిషన్‍లో పేర్కొన్నారు. దీంతో కూల్చివేతలను ఆపాలని శనివారమే (ఆగస్టు 24) హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, అప్పటికే దాదాపు ఆ భవనాన్ని హైడ్రా దాదాపు పూర్తిగా నేటమట్టం చేసేసింది. అయితే, ఈ విషయంపై వాదనలు కొనసాగనున్నాయి.

సినిమాలు ఇలా..

నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్నారు. తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ చిత్రంపై ఆసక్తిని పెంచేశాయి. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి కానుంది.

సోగ్గాడే చిన్ననాయన, బంగర్రాజు ఫేమ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణతో మరో మూవీ చేసేందుకు నాగార్జున ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, నాగార్జున హోస్ట్ చేసే బిగ్‍బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీన మొదలుకానుంది.