Kushi 2: 'ఖుషి 2' పవన్ కల్యాణ్‍తోనే చేయండి: హీరోయిన్ ప్రియాంక మోహన్-do kushi 2 with pawan kalyan only priyanka mohan to sj surya at saripodhaa sanivaaram pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi 2: 'ఖుషి 2' పవన్ కల్యాణ్‍తోనే చేయండి: హీరోయిన్ ప్రియాంక మోహన్

Kushi 2: 'ఖుషి 2' పవన్ కల్యాణ్‍తోనే చేయండి: హీరోయిన్ ప్రియాంక మోహన్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 24, 2024 10:33 PM IST

Kushi 2 - Priyanka Mohan: ఖుషి 2 చేయాలంటూ ఎస్‍జే సూర్యకు చెప్పారు హీరోయిన్ ప్రియాంక మోహన్. సరిపోదా శనివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ సినిమా గురించి ప్రస్తావించారు. మళ్లీ డైరెక్షన్ ఎప్పుడు అంటూ సూర్యను ప్రియాంక అడిగారు.

Kushi 2: 'ఖుషి 2' పవన్ కల్యాణ్‍తోనే చేయండి: హీరోయిన్ ప్రియాంక మోహన్
Kushi 2: 'ఖుషి 2' పవన్ కల్యాణ్‍తోనే చేయండి: హీరోయిన్ ప్రియాంక మోహన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో ఖుషి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 2001లో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు ఓ క్లాసిక్‍గా నిలిచింది. చాలా మందికి ఈ మూవీ ఫేవరెట్‍గా ఉంటుంది. ఖుషి సినిమాకు ఎస్‍జే సూర్య దర్శకత్వం వహించారు. ఖుషి సినిమాకు సీక్వెల్ వస్తుందా అని పవన్ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్నేళ్లకు గుర్తు చేశారు హీరోయిన్ ప్రియాంక మోహన్. నేడు (ఆగస్టు 24) జరిగిన సరిపోదా శనివారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఖుషి 2 గురించి ఆమె ప్రస్తావించారు.

చేస్తే పవన్ కల్యాణ్‍తోనే..

ఎస్‍జే సూర్య కొంతకాలంగా డైరెక్షన్‍ను పక్కనపెట్టి నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. దీంతో మళ్లీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారని సూర్యను హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఖుషి 2 గురించి అడిగారు.

ఖుషి 2 సినిమాను ఆశించవచ్చా అని ఎస్‍జే సూర్యను ప్రియాంక మోహన్ అడిగారు. “అందరి తరఫున నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. మళ్లీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారు. మేం ఖుషి 2 సినిమాను ఆశించవచ్చా. ఖుషి 2 సినిమా చేస్తే పవన్ కల్యాణ్‍తోనే చేయండి. అది క్లాసిక్ సినిమా” అని ప్రియాంక మోహన్ చెప్పారు. దీంతో ఎస్‍జే సూర్య గట్టిగా నవ్వారు.

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా చేశారు. ఈ చిత్రంలో ఎస్‍జే సూర్య విలన్‍గా నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు హైదరాబాద్‍లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది.

మళ్లీ ఓజీ మోత

పవన్ కల్యాణ్ హీరోగా ఉన్న ఓజీ సినిమాలోనూ ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ ఈ ఏడాది బాధ్యతలు చేపట్టడంతో కొన్ని నెలలుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు. అయితే, త్వరలోనే ఆయన ఓజీ సినిమా షూటింగ్‍లో పాల్గొనే ఛాన్స్ ఉంది. సరిపోదా శనివారం సినిమా ఈవెంట్‍లో మరోసారి ఓజీ సినిమా పేరు మోత మోగింది. ఈ రెండు చిత్రాలను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దీంతో సరిపోదా శనివారం ఈవెంట్‍లో ఆయన మాట్లాడేందుకు వచ్చేసరికి ప్రేక్షకులు ఓజీ.. ఓజీ అని అరిచారు. ఈ మూవీ కోసం జరిగిన దాదాపు అన్ని ఈవెంట్లలో ఓజీ పేరు మోతమోగింది. త్వరలోనే షూటింగ్ మళ్లీ మొదలవుతుందంటూ నిర్మాత దానయ్య చెబుతున్నారు. ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

సరిపోదా శనివారం బుకింగ్స్ షురూ

సరిపోదా శనివారం సినిమా భారీ అంచనాలతో వస్తోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ అదిరిపోవడంతో హైప్ మరింత పెరిగింది. ఆగస్టు 29న ఈ యాక్షన్ చిత్రం రిలీజ్ కానుండగా.. నేడు టికెట్ల అడ్వాన్స్డ్ బుకింగ్స్ కొన్ని చోట్ల మొదలయ్యాయి. మిగిలిన చోట్ల అతిత్వరలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. సరిపోదా శనివారం సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రొడ్యూజ్ చేశారు.