Pawan Kalyan on Movies: క్యాజీ అంటారేమోనని భయం: డిప్యూటీ సీఎం అయ్యాక పెండింగ్ సినిమాలపై తొలిసారి మాట్లాడిన పవన్ కల్యాణ్
Pawan Kalyan on Movies: పవన్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో మూడు సినిమాలు పెండింగ్‍లో ఉన్నాయి. డిప్యూటీ సీఎం అయ్యాక తాను చేయాల్సిన చిత్రాల గురించి తొలిసారి పవన్ మాట్లాడారు. షూటింగ్‍కు చేసుకున్న ప్లాన్‍ను చెప్పారు.
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే డిప్యూటీ సీఎం పదవిని ఆయన చేపట్టారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్థి, అటవీ లాంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పవన్ కల్యాణ్ ఉన్నారు. కాగా, పవన్ హీరోగా చేయాల్సిన మూడు సినిమాలు పెండింగ్‍లో ఉన్నాయి. షూటింగ్ జరగాల్సి ఉంది. ఆ చిత్రాలపై సందిగ్ధత నెలకొంది. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి అసంపూర్తిగా ఉన్న తన సినిమాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు.
క్యాజీ అంటారేమోనని..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు (జూలై 3) ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడేటప్పుడు ప్రేక్షకులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆయన స్పందించారు. ఎన్నికయ్యాక కనీస పనులు చేయకుండా కూడా చేయకుండా ఓజీ షూటింగ్‍కు వెళితే.. క్యాజీ (ఏంటండి) అంటారనే భయపడుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. మూడు నెలలు పనులను చక్కబెట్టి.. ఆ తర్వాత వీలైనప్పుడు షూటింగ్‍లకు వెళతానని ఆయన చెప్పారు. సినిమాల కంటే ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యత అనేలా ఆయన స్పష్టం చేశారు.
టైమ్ ఉందంటారా?
ఓజీ గురించి చెప్పాలని అభిమానులు గట్టిగా అరిచారు. దీంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ స్పందించారు. “సినిమాలు చేసే టైమ్ ఉందంటారా?” అంటూ వారిని ప్రశ్నించారు. ఎలాగూ మాట ఇచ్చాం కాబట్టి అంటూ పెండింగ్‍లో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాననేలా చెప్పారు. “ముందు ఒక మూడు నెలలు.. కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు తిట్టకూడదు కదా. కనీసం గ్రామాలకు కొత్త రోడ్ల కంటే ముందు గుంతలు పూడ్చాలి. మేం ఎన్నుకుంటే నువ్వు మళ్లీ ఓజీ చేస్తావా అని క్యాజీ అంటే నేనేం చెప్పను. మళ్లీ మీరు తిట్టకూడదు కదా. మా నిర్మాతలకు కూడా చెప్పా. కొంచెం క్షమించాలి. మా ఆంధ్ర రాజ్య ప్రజలకు మేం కొంత సేవ చేసుకొని.. ఎక్కడా పనికి అంతరాయం రాకుండా కుదిరినప్పుడల్లా రెండు రోజులో, మూడురోజులో షూటింగ్ చేస్తానని అని చెప్పా” అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఓజీ సినిమా గురించి అలానే అరుస్తుంటే మంచి జోష్ వచ్చే కామెంట్ చేశారు పవన్ కల్యాణ్. “ఓజీ చూద్దురు కానీ బాగుంటది” అని అన్నారు.
పవన్ చేతిలో మూడు సినిమాలు
పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా రావాల్సి ఉంది. ఈ గ్యాంగ్‍స్టర్ బ్యాక్‍డ్రాప్ యాక్షన్ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లింప్స్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీలో కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓజీ షూటింగ్ ఇంకా పెండింగ్‍లో ఉంది. పవన్ ఎప్పుడు షూటింగ్‍కు వెళతారోననే ఉత్కంఠ నెలకొని ఉంది. సెప్టెంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
పవన్ కల్యాణ్ లైనప్‍లో హరిహర వీరమల్లు చిత్రం ఉంది. నాలుగేళ్లుగా ఈ మూవీ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోగా.. ఇప్పుడు జ్యోతి కృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పవన్ కల్యాణ్ చేయాల్సి ఉంది.
టాపిక్