OTT Comedy movies: తక్కువ బడ్జెట్.. బంపర్ హిట్లు.. ఒకే రోజు ఓటీటీల్లోకి రానున్న రెండు తెలుగు సినిమాలు
Committee Kurrollu, Aay OTT: ఓటీటీల్లోకి ఈ వారం రెండు సూపర్ హిట్ చిత్రాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‍తో వచ్చి బ్లాక్‍బస్టర్ అయిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ చిత్రాలు ఎక్కడ అందుబాటులోకి వస్తాయంటే..
ఆగస్టులో రెండు తక్కువ బడ్జెట్ సినిమాలు దుమ్మురేపాయి. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ ఎంటరైనర్లుగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ చిత్రాలు అంచనాలకు మించి కలెక్షన్లు రాబయ్యాయి. స్టార్లు లేకపోయినా కంటెంట్ ఉంటే హిట్ కొట్టచ్చని మరోసారి ప్రూవ్ చేశాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కామెడీ ఎంటర్‌టైనర్ కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9న విడుదలై మంచి హిట్ అయింది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి క్రేజీ సినిమాలు ఉన్నా పోటీలోకి వచ్చిన ఆయ్ చిత్రం.. ఇండిపెండెన్స్ డే పోటీలో విన్నర్ అయింది. నార్నే నితిన్ హీరోగా చేసిన ఈ చిత్రం ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టింది. ఇప్పుడు, కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ చిత్రాలు ఒకే రోజున ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి.
కమిటీ కుర్రోళ్ళు స్ట్రీమింగ్
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఈ వారంలోనే సెప్టెంబర్ 12వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో మంచి ధరకు ఈ సినిమా హక్కులను ఆ ప్లాట్‍ఫామ్ కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 12 స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, శ్యామ్ కల్యాణ్, లోకేశ్ కుమార్ సహా మరికొందరు కీలకపాత్రలు పోషించారు. గోదావరి గ్రామంలో స్నేహితుల మధ్య ఈ చిత్రం స్టోరీ సాగుతుంది. ఈ మూవీకి యధు వంశీ దర్శకత్వం వహించారు.
కమిటీ కుర్రోళ్ళు మూవీ సుమారు రూ.5కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం సుమారు రూ.17కోట్ల కలెక్షన్లు దక్కించుకొని సూపర్ హిట్ అయింది. నిర్మాతగా తొలి మూవీతోనే భారీ సక్సెస్ సాధించారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.
ఆయ్ ఓటీటీ రిలీజ్
నార్నే నితిన్ హీరోగా నటించిన ఆయ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుంది. స్ట్రీమింగ్ డేట్‍పై నెట్‍ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పటికే వచ్చింది.
ఆయ్ సినిమాలో నితిన్‍కు జోడీగా నయన్ సారిక హీరోయిన్‍గా చేశారు. రాజ్‍కుమార్ కసిరెడ్డి, అకింత్ కొయ్య, మైమ్ గోపీ, కృష్ణ చైతన్య, వీటీవీ గణేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ రూరల్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అంజీ కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది.
ఆయ్ సినిమా సుమారు రూ.14కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ మూవీ రూ.6కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిందని అంచనా. అనుకున్న దాని కంటే ఎక్కువ వసూళ్లను సాధించి ఈ చిత్రం బంపర్ హిట్ అయింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించారు.
సెప్టెంబర్ 12 నుంచి కమిటీ కుర్రోళ్ళు సినిమాను ఈటీవీ విన్‍లో, ఆయ్ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.