Bandi Saroj Kumar: చిరంజీవి బర్త్ డేకి బోల్డ్ హీరో మూవీ.. చిరంజీవిని గారు అని పిలవనంటూ షాకింగ్ కామెంట్స్-bold director bandi saroj kumar about calling chiranjeevi garu in parakramam release announcement teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bandi Saroj Kumar: చిరంజీవి బర్త్ డేకి బోల్డ్ హీరో మూవీ.. చిరంజీవిని గారు అని పిలవనంటూ షాకింగ్ కామెంట్స్

Bandi Saroj Kumar: చిరంజీవి బర్త్ డేకి బోల్డ్ హీరో మూవీ.. చిరంజీవిని గారు అని పిలవనంటూ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jul 24, 2024 11:33 AM IST

Bandi Saroj Kumar About Calling Chiranjeevi Garu: పక్కా బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన మాంగళ్యం, నిర్బంధం వంటి సినిమాల హీరో, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ లేటెస్ట్ మూవీ పరాక్రమం. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కానుంది.

చిరంజీవి బర్త్ డేకి బోల్డ్ హీరో మూవీ.. చిరంజీవిని గారు అని పిలవనంటూ షాకింగ్ కామెంట్స్
చిరంజీవి బర్త్ డేకి బోల్డ్ హీరో మూవీ.. చిరంజీవిని గారు అని పిలవనంటూ షాకింగ్ కామెంట్స్

Bandi Saroj Kumar About Calling Chiranjeevi: అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగాను బోల్డ్ డైరెక్టర్ అని పిలుస్తారని తెలిసిందే. కానీ, వీటికంటే ఎక్కువగా పక్కా నాటు బోల్డ్ కంటెంట్‌తో సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ అండ్ హీరో బండి సరోజ్ కుమార్. తెలంగాణ యాస, నాటు బూతులతో నిజాన్ని నిక్కచ్చిగా చూపించే దర్శకుడు బండి సరోజ్ కుమార్.

బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయదర్శకత్వంలో 2020లో నిర్బంధం, 2022లో మాంగళ్యం వంటి బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మరో సినిమానే పరాక్రమం. బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేస్తున్న చిత్రం "పరాక్రమం".

ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పరాక్రమం సినిమాను ఆగస్టు 22న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూవీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. "మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేస్తున్నాం. చిరంజీవి ని గారు అని పిలవమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం అమ్మ గారు అని పిలవం. అలాగే నన్ను ఎంతో ఇన్స్‌పైర్ చేసిన చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తాను. ఆయన నాకు శివుడిలా భావిస్తా" అని ఆశ్చర్యకర కామెంట్స్ చేశారు.

"పరాక్రమం సినిమా విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నారాయణగూడ బాయ్స్ హాస్టల్‌లో ఉండేవాడిని. ఆర్టీవో ఆఫీసర్ అబ్బాయి మా పొరుగునే ఉండేవాడు. వాళ్లది రిచ్ ఫ్యామిలీ. నేను ఒక రోజు రోడ్డు మీద క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే క్రికెటర్ అవుతావా మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. వెనక చూసి ముందుకు వెళ్లాలి బ్రదర్ అన్నాడు" అని బండి సరోజ్ చెప్పుకొచ్చారు.

"ఆరోజు ఆయన అన్న మాటలు నాలో కసిని నింపాయి. ఒకరోజు అతను నన్ను తలెత్తుకుని చూడాలి అనుకున్నా. ఆ ఫైర్ తోనే ఈ సినిమాలో నా లోవరాజు క్యారెక్టర్ రాసుకున్నా. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో. బ్రదర్ నీకు థ్యాంక్స్ చెబుతున్నా. నేను గతంలో నిర్బంధం , నిర్బంధం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించాను. అవి డిజిటల్ గానే మీ ముందుకు వచ్చాయి. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం" అని బండి సరోజ్ అన్నారు.

"నా గత సినిమాలు కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే చూశారు. కానీ, ఈ పరాక్రమం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నేను చిత్ర పరిశ్రమలో ఎదగాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. వారికి థాంక్స్ చెబుతున్నా" అని తన గత సినిమాల తరహాలో పరాక్రమం అంత బోల్డ్‌గా ఉందని బండి సరోజ్ తెలిపారు.