Allu Arjun on Pawan Kalyan: పవన్ కల్యాణ్ గెలుపుపై స్పందించిన అల్లు అర్జున్ .. ట్వీట్ చేసిన బన్నీ
Allu Arjun on Pawan Kalyan: పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో జనసేనాని పవన్ కల్యాణ్ గెలవడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Allu Arjun on Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పిఠాపురం శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (జూన్ 4) జరిగింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ 70వేలకు పైగా మెజార్టీతో అద్భుత విజయం సాధించారు. తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనకు అభినందనల వెల్లువ వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మామ పవన్ కల్యాణ్ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
కృషి, అకింతభావం
ప్రజలకు సేవ చేసే క్రమంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న సందర్భంగా పవన్ కల్యాణ్‍కు శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్. “అద్భుతమైన విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రజలకు సేవ చేసేందుకు మీ అంతులేని కృషి, అంకితభావం ఎప్పుడూ మా మనసులను తాకుతుంటోంది. ప్రజలకు సేవ చేసేందుకు కొత్త ప్రయాణం కోసం మీకు బెస్ట్ విషెస్” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
మే నెలలో ఏపీ ఎన్నికల పోలింగ్‍కు ముందు వైఎస్‍ఆర్ సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి.. అల్లు అర్జున్ మద్దతు తెలపడం కాస్త దుమారం రేపింది. జనసేనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో బన్నీపై కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తనకు పార్టీలతో సంబంధం లేదని స్నేహం కోసమే వ్యక్తిగతంగా శిల్పా రవికి మద్దతు ఇచ్చానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఆ తర్వాత, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఈ వివాదాన్ని మరింత ఎక్కువ చేసింది. ఆ తర్వాత నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేయడం, రోజులు గడవటంతో ఈ వివాదం సద్దుమణిగింది.
సాయిధరణ్ తేజ్ ఇలా..
తన మామ పవన్ కల్యాణ్ విజయంపై మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం, భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది. జనసేన పార్టీ తుఫాన్” అని పోస్ట్ చేశారు. ఓ చిన్నారిని పవన్ కల్యాణ్ ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అలాగే, అధఃపాతాళానికి తొక్కేస్తానంటూ వైఎస్ జగన్‍ను పవన్ గతంలో హెచ్చరించిన వీడియోను కూడా తేజ్ షేర్ చేశారు.
టాలీవుడ్ నుంచి చాలా మంది సెలెబ్రెటీలు పవన్‍కు శుభాకాంక్షలు చెప్పారు. చరిత్ర సృష్టించేలా గెలువడంతో పాటు కూటమి ఆధిపత్యం ప్రదర్శించటంలో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించినందుకు ఓ అభిమానిగా, ఓ తమ్ముడిలా తనకు పట్టలేనంత సంతోషం వస్తోందని యంగ్ హీరో నితిన్ ట్వీట్ చేశారు. భావోద్వేగంతో తన సంతోషాన్ని వ్యక్తం చేయలేకున్నానని పేర్కొన్నారు. పవన్ స్టార్ ఫరెవర్ అంటూ రాసుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత ఫలితాన్ని దక్కించుకుంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్‍సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. 100 శాతం ఫలితాన్ని సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటే గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు చరిత్ర సృష్టించింది.