Pawan Kalyan: పవన్ కల్యాణ్ విజయంతో టాలీవుడ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచాడు. అక్కడ సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి అయిన వంగా గీతపై పవన్ ఏకంగా 69,169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పిఠాపురం నుంచి ఘన విజయం సాధించాడు. దీంతో అతని విజయాన్ని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంది. పవన్ కల్యాణ్ తో గతంలో గబ్బర్ సింగ్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ గెలుపును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
రవితేజతో అతడు చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా యూనిట్ తో కలిసి బాణసంచా కాల్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ గెలిచాడని తెలియగానే సెట్లోనే అందరితో కలిసి అతడు సంబరాలు చేసుకున్నాడు. పవన్ ఒక్కడే కాదు జనసేన పార్టీ మొత్తం ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఈసారి ఆ సంఖ్య 21కి చేరింది. టీడీపీ, బీజేపీతో కలిసి ఏపీలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఐదేళ్లలో ఇంత భారీ తేడా మామూలు విషయం కాదు.
అటు ఈసారి ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్సార్సీపీకి ఘోర పరాజయం తప్పలేదు. కిందటిసారి 151 స్థానాల్లో గెలిపించిన ఏపీ ప్రజలు.. ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా ఓట్లేశారు. పవన్ విజయాన్ని అటు అల్లు అర్జున్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతనికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు.
"పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలకు సేవ చేయడానికి మీ హార్డ్ వర్క్, అంకితభావం, నిబద్ధత ఎప్పుడూ గుండెను తాకుతుంది. ప్రజలకు సేవ చేయడానికి మీరు మొదలు పెడుతున్న కొత్త ప్రయాణానికి నా బెస్ట్ విషెస్" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ ఒక్కడే కాదు.. టాలీవుడ్ ప్రముఖులంతా పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాపిక్