Congress Party Jana Jatara Sabha at Tukkuguda: పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పలు జాబితాలను కూడా విడుదల చేసింది. మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా…. ఇవాళ(మార్చి 06) తెలంగాణలోని తుక్కుగూడ వేదికగా జన జాతర(Congress Jana Jatara Sabha) సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు రాజీవ్ గాంధీ సభా ప్రాంగణంగా పేరును ఖరారు చేశారు.
ఈ సభ కోసం దాదాపు 10 లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేసింది రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) పాటు పలువురు మంత్రులు.. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వచ్చేలా…. కార్యాచరణను సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఇక మహిళల కోసం ఈ సభలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సభకు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉంది.
జన జాతర సభ(Congress Jana Jatara Sabha) నుంచి లోక్ సభ ఎన్నికల(Loksabha Polls 2024) శంఖారావాన్ని పూరించనుంది కాంగ్రెస్ నాయకత్వం. ఇందుకోసం పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు మరికొందరు ముఖ్యులు హాజరుకానున్నారు. అయితే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా… ఇదే వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది కాంగ్రెస్ పార్టీ. సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన ఈ భారీ సభలోనే సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. అయితే ఈసారి కూడా ఇక్కడ్నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల మేనిఫెస్టోను వివరించనుంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత… రాష్ట్రంలో సమీకరణాలు మారిపోతున్నాయి, బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు… కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు… కాంగ్రెస్ లో చేరారు. గేట్లు తెరిచామంటూ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేసిన నేపథ్యంలో… చేరికలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. అయితే తుక్కుగూడలో తలపెట్టిన జన జాతర సభ వేదికపై పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మాత్రం ఎలాంటి లీకులు అందటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ… ఎవరనేది మాత్రం క్లారిటీ రావటం లేదు. ఇక ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు…. కాంగ్రెస్ లే చేరే అవకాశం ఉంది. ఇటీవలే బీఆర్ఎస్ ను వీడిన కే కేశవరావు… ఇదే సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఎమ్మెల్యేల చేరిక విషయంలో…. ఎలాంటి సమాచారం బయటికి రాకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుందన్న చర్చ కూడా వినిపిస్తోంది. అయితే వార్తలు వస్తున్నట్లు…. ఈ సభ వేదిక నుంచే సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా..? లేదా అనేది చూడాలి…! మొత్తంగా చూస్తే చేరికల విషయంలో తుక్కుగూడ సభలో ఏం జరగబోతుందనేది అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది.
సంబంధిత కథనం