Congress manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోలో 14 హామీలతో మహిళలకు పెద్ద పీట
Congress manifesto: 2024 లోక్ సభ ఎన్నికల కోసం ‘న్యాయ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇందులో మహిళలకు ప్రత్యేకంగా పలు హామీలను ఇచ్చింది. వాటిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు, వేతన సమానత్వం, గృహ హింస వంటి నేరాలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు వంటి హామీలు ఉన్నాయి.

Congress manifesto: 2024 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 'న్యాయ్ పత్ర (Nyay Patra)' పేరుతో తన మేనిఫెస్టో (Congress manifesto)ను విడుదల చేసింది. ఐదు కీలక విభాగాలుగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. అవి యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్. ఈ విభాగాల కింద 25 హామీలను ఇచ్చింది. భారతీయ మహిళల కోసం ‘నారీ న్యాయ్ (Naari Nyay) ’ పేరుతో నగదు బదిలీ, ఉపాధి అవకాశాలు, వేతన సమానత్వం, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలలో భద్రత, ఉద్యోగ కోటాలు మొదలైన అనేక వాగ్దానాలను కాంగ్రెస్ చేసింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఇచ్చిన 14 వాగ్దానాలు ఇవే..
మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన వాగ్దానాలు
1. బేషరతుగా నగదు బదిలీ కింద ప్రతి పేద భారతీయ కుటుంబానికి సంవత్సరానికి రూ .1 లక్ష అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం. ఈ మొత్తాన్ని ఇంటిలోని పెద్ద మహిళకు లేదా పెద్ద సభ్యుడికి బదిలీ చేస్తారు.
2. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
3. న్యాయమూర్తులు, న్యాయాధికారులు, లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లు వంటి ఉన్నత పదవుల్లో మరింత మంది మహిళలను నియామకం.
4. 'సమాన పని, సమాన వేతనం' సూత్రాన్ని అమలు (Congress manifesto).
5. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు రెట్టింపు.
6. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల పెంపు.
7. న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని ప్రదేశాలు, ప్రసూతి ప్రయోజనాలు మొదలైన వాటి ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం.
8. భారతీయ మహిళా బ్యాంకును తిరిగి ప్రారంభించడం.
9. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013, గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005 వంటి చట్టాల కఠిన అమలు.
10. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ సంఖ్యను రెట్టింపు చేసి ప్రతి జిల్లాకు ఒక సావిత్రీబాయి ఫూలే హాస్టల్ ఏర్పాటు.
11. మహిళలకు వారి న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించడానికి, వారికి న్యాయం అందడంలో సహాయపడడానికి ప్రతి గ్రామ పంచాయతీలో అధికార్ మైత్రిని నియమిస్తారు.
12. పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా న్యాప్ కిన్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తారు.
13. పట్టణాలు, నగరాల్లో తగినన్ని సురక్షితమైన, పరిశుభ్రమైన పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు.
14. 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేయనుంది. అలాగే 2029 లోక్ సభ ఎన్నికల్లో కూడా మహిళలకు మూడింట ఒక వంతు కోటాను వర్తింపజేస్తుంది.
ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్
లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియాలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ తన మేనిఫెస్టోను ఇంకా విడుదల చేయలేదు, కానీ కాషాయ పార్టీ ఇప్పటికే "మోదీ కా గ్యారంటీ" పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది.