Tukkuguda Municipality| రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీ ఖాతాలోకి తుక్కుగూడ మున్సిపాలిటీ
రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. తుక్కుగూడ మున్సిపాలిటీని కోల్పోవాల్సి వచ్చింది. మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న కాంటేకర్ మధు మోహన్ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుమ రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతుంది. అందులో భాగంగానే.. టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి పెట్టేందుకు కమలం దళం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ కాంటేకర్ మధుమోహన్ ను పార్టీలో చేర్చుకుంది. ఇదంతా కూడా మినిస్టర్ కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే జరగడం విశేషం. మంత్రి సబితా.. ఎన్నిప్రయత్నాలు చేసినా.. చివరకు మధుమోహన్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీలో కలిసి కాషాయం కండువా కప్పుకున్నారు.
తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై మెుదటి నుంచి చర్చ జరిగింది. ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రణాళికలు వేసింది. అయితే ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 15 వార్డులకు గానూ 9 వార్డుల్లో బీజేపీ, 5 వార్డులు టీఆర్ఎస్ మాత్రమే గెలిచింది. బీజేపీ టికెట్ ఆశించి.. రాలేదనే ఉద్దేశంతో మధుమోహన్ రెండో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ బీజేపీకే ఆధిక్యం వచ్చినా.. మంత్రి సబితా రెడ్డి పావులు కదిపి.. మధుమోహన్ ను తమ వైపు తిప్పుకున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో తుక్కుగూడ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అందుకుగానూ.. మధుమోహన్ కు మున్సిపల్ ఛైర్మన్ పదవి అప్పగించారు. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లడంతో రంగారెడ్డి జిల్లాలో మెుత్తం 3 స్థానాలు కమలం ఖాతాలోకి చేరాయి.
మంత్రి కేటీఆర్ పర్యటనకు సైతం మధుమోహన్ దూరంగా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలతో విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీన్నే.. బీజేపీ నేతలు వాడుకున్నారు. మధుమోహన్ ను తమవైపు తిప్పుకున్నారు. విషయం తెలిసి.. మంత్రి సబితా రెడ్డి.. ఎంత సర్ది చెప్పినా.. ఫలితం లేకుండా పోయింది.
మున్సిపల్ చట్టం ప్రకారం.. మూడేళ్ల వరకూ ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేదు. ఇప్పటికే రెండేళ్లు గడిచింది. ఇంకో ఏడాదిపాటు మధు మోహన్ పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ నేతల మాట. నిజానికి మధుమోహన్ బీజేపీ నాయకుడే.. పార్టీ టికెట్ రాకపోడవంతో ఇండిపెండెంట్ గా గెలిచి.. టీఆర్ఎస్ లో చేరారు.
సంబంధిత కథనం