Congress manifesto ‘ఎన్నికల చట్టాలను సవరిస్తాం, జమిలి ఎన్నికలకు నో’- మేనిఫెస్టోలో కాంగ్రెస్
లోక్ సభ ఎన్నికల కోసం న్యాయ పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అందులో కొన్ని కీలక హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. అందులో ఒకటి ఎన్నికల చట్టాల సవరణ. ఈవీఎం లో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్ ల సంఖ్య సరిపోతేనే.. ఆ ఎన్నిక ఫలితాన్ని నిర్ధారించేలా చట్టంలో మార్పులు చేస్తామని తెలిపింది.
Lok sabha elections 2024: అధికారంలోకి వస్తే ఎన్నికల చట్టాలను సవరిస్తామని, ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరుగుతుందని, అయితే ఎలక్ట్రానిక్ ఓట్ల లెక్కింపును వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (EVM) సామర్థ్యం, బ్యాలెట్ పేపర్ పారదర్శకతను మేళవించి ఎన్నికల చట్టాలను సవరిస్తామన్నారు. ఈవీఎం ద్వారానే ఓటింగ్ జరుగుతుందని, అయితే, ఈవీఎం చూపే ఓట్ల సంఖ్యను ఓటరు వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) యూనిట్లోని స్లిప్పులతో సరిపోల్చుతామని వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు.
జమిలి ఎన్నికలకు వ్యతిరేకం
రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిపే 'వన్ నేషన్ వన్ ఎలక్షన్ (one nation one election) ' ఆలోచనకు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. జమిలి ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఎప్పుడు జరగాలో అప్పుడు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.
ఫిరాయింపుల వ్యతిరేక చట్టం
ఒక పార్టీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికై వేరే పార్టీలో చేరిన వారి ఎంపీ లేదా ఎమ్మెల్యే సభ్యత్వాలు ఆటోమేటిక్ గా రద్దు అయ్యేలా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ (congress) తన మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర (Nyay Patra)’ లో తెలిపింది. ఇందుకు గానూ రాజ్యాంగంలోని పదో షెడ్యూలును సవరిస్తామని తెలిపింది. ‘‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదంతో ఆహారం, దుస్తులు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా పర్యటించడం, నివసించడం వంటి వ్యక్తిగత ఎంపికల్లో జోక్యం చేసుకోబోమని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అన్ని చట్టాలు, నిబంధనలను రద్దు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది.
ఏడాదికి 100 రోజులు పార్లమెంటు సమావేశాలు
పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదిలో 100 రోజులు సమావేశమవుతాయని, గతంలో ఉన్న పార్లమెంటు గొప్ప సంప్రదాయాలను పునరుద్ధరిస్తామని, చిత్తశుద్ధితో పాటిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సభలో ప్రతిపక్షాలు సూచించిన అజెండాపై చర్చించేందుకు వారంలో ఒక రోజు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు ఏ రాజకీయ పార్టీతోనైనా సంబంధాలు తెంచుకోవాలని, తటస్థంగా ఉండాలన్న నిబంధనను పాటిస్తామని తాము హామీ ఇస్తున్నామని కాంగ్రెస్ పేర్కొంది.
రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తి
భారత ఎన్నికల కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, మానవ హక్కుల కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ కమిషన్లు, ఇతర రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని మరియు నవ సంకల్ప ఆర్థిక విధానం యొక్క అవసరాలను తీర్చడానికి మధ్య మరియు దీర్ఘకాలిక దృక్పథ ప్రణాళికలను రూపొందించడంతో సహా దాని పాత్ర మరియు బాధ్యతలను నిర్వచిస్తామని పార్టీ వాగ్దానం చేసింది.