CEC Review: భారత పౌరులు ఎవరికైనా దేశంలో ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని, ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేవారు.
పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాకుండా, ఎక్కడ నివసిస్తే.. అక్కడ మాత్రమే ఓటు ఉండాలని వివరణ ఇచ్చారు. ఎవరికైనా రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో కూడా ఓటు కోసం దరఖాస్తు చేయడం సరికాదన్నారు.
ఏపీలో సొంత ఆస్తులు ఉన్నా ఏపీలో నివసించకపోతే ఓటు హక్కు కల్పించ లేమన్నారు. డూప్లికేట్ ఓట్ల సమస్య నేపథ్యంలో ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయని దీనిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది మంచి పరిణామమని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్ల మంది ఉంటే పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందని వివరించారు.
రాష్ట్రంలో 18ఏళ్లు నిండిన 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
2024 పార్లమెంట్ ఎన్నికల కోసం భారత ఎన్నికల కమీషన్ పెద్దఎత్తున సన్నాహాలు చేస్తోందని భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎస్ హెచ్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు ఇంకా ఏమి చేయాలనే దానిపై అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికల కార్యనిర్వాహక యంత్రాంగంతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు.
గత 3 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలు మరియు సిఎస్, డిజిపితో సహా ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. 2024లో ఉత్తమమైన ఎన్నికల వాతావరణాన్ని దేశానికి అందించాలన్నదే తమ ధ్యేమమని ఈ సందర్భంగా సిఇసి స్పష్టం చేసారు.
ఆంధ్రప్రదేశ్‌తో కలిపి 2024 లోక్‌సభకు సాధారణ ఎన్నికల కోసం ఎన్నికల సంసిద్ధతను పరిశీలించామన్నారు. పారదర్శకమైన ఎన్నికల జాబితా, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలు లేవనెత్తే అన్ని అభ్యంతరాలను ఇసి పరిష్కరిస్తుందన్నారు.
భారత ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు తగిన ప్రాధన్యత ఇస్తుందని, తదనుగుణంగా అధికారులను నిర్దేశిస్తుందన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కఠినమైన చర్యల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా పరిపాలనా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించిందని అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించామని సీఈసీ తెలిపారు.
రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు ఉన్నారని, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయని వివరించారు.` తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉందన్నారు.