YS Jagan in Yemmiganur : చంద్రబాబు మళ్లీ మోదీని తెచ్చుకున్నారు - నాడు ఒక్క హామీనైనా అమలు చేశారా..? - వైఎస్ జగన్
YSRCP Public Meeting at Yemmiganur: ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన చేపట్టిన బస్సు యాత్ర 3వ రోజుకి చేరింది. ఇవాళ ఎమ్మిగనూరులో తలపెట్టిన సభలో మాట్లాడారు. అన్ని రంగాల్లో విప్లవత్మాకమైన మార్పులు తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలని కోరారు.
YSRCP Memantha Siddham Yatra Day 3 Updates: ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఎమ్మిగనూరులో మాట్లాడిన ఆయన.....పెత్తందార్లను ఓడించడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. మీరు సిద్ధమా? అని ప్రజలను ఉద్దేశించి అడిగారు. గతంలో ఎప్పుడూ లేని మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. విద్యారంగంలో విప్లవత్మాకమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో నిర్ణయాలను తీసుకున్నామని.... ఉచితంగా ట్యాబ్ లను అందజేశామని తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. జెండాలు జత కట్టిన వారిని.... పేదల వ్యతిరేకులను ఓడించాలని జగన్ కోరారు.
"ఈ 58 నెలల్లో సామాజిక న్యాయాన్ని పాటించాం. 2 లక్షల 30వేల శాశ్వత ఉద్యోగాలను ఇచ్చాం. ఇందులో కూడా 80 శాతం ఉద్యోగాలను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చాం. ప్రతి నెలా ఒకటో తేదీన రూ. 3వేల పెన్షన్ అందిస్తున్నాం. 50 శాతం పదవులను చట్టం చేసి అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులను కల్పించాం. కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేష్లను కల్పించాం. రైతుభరోసాతో అన్నదాతలకు అండగా నిలిచాం. పగటిపూటనే రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చాం. రాజ్యసభ నుంచి కింది స్థాయి పదవుల వరకు సామాజిక న్యాయాన్ని పాటించాం. మన సామాజిక విప్లవ రథాన్ని ఆపకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయండి. ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పిన వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. ఇళ్ల స్థలాలను అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పారు. ఆ పార్టీల భవిష్యత్ కు సమాధులు కట్టాలి. రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలి. చంద్రబాబుతో (Chandrababu)పాటు ఆయన తోకలను కత్తిరించాలి" అని వైఎస్ జగన్ కోరారు.
YS Jagan On CBN : చంద్రబాబుపై జగన్ ఫైర్...
“ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వీరందరికి తోడు ఓ దత్తపుత్రుడు చంద్రబాబుకు తోడుగా ఉన్నారు. వీళ్లు ఎవరూ ఏపీలో ఉండరు. హైదరాబాద్ లో ఉంటారు. ఇలాంటి వారు చేస్తున్న పనులను గమనించండి. చంద్రబాబుకు విలువులు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చే మంచి స్కీమ్ కూడా లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చేది మాత్రం వెన్నుపోటు, మోసాలే. గతంలో ఇప్పుడు మాదిరిగానే చంద్రబాబు…. మోదీని (Modi)తెచ్చుకున్నారు. 2014లో మెనిఫెస్టో చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. 650 హామీలతో మేనిఫెస్టోను చంద్రబాబు ఇచ్చారు. దీనిపై మోదీ, పవన్ ఫొటోలను కూడా పెట్టారు. పైగా చంద్రబాబు(Chandrababu) సంతకం ఉంటుంది. ముఖ్యమైన హామీలు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇందులో చెప్పిన రుణమాఫీ చేశాడా…? డ్వాకా సంఘాల పొదుపు రుణాలను మాఫీ చేశాడా…? మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి రూ. 25వేలు జమ చేస్తా అని చెప్పారు. మరీ చంద్రబాబు ఈ డబ్బులను జమ చేశాడా…? కనీసం ఒక్కరికైనా డబ్బులను డిపాజిట్ చేశాడా…? పేదలకు కనీసం సెంటు స్థలమైనా ఇచ్చాడా..? ఇవన్నీ కూడా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో పత్రంలోనే ఉన్నాయి” అని జగన్ చదివి వినిపించారు.
ఇప్పుడు ఎన్నికలు రాగానే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మళ్లీ మోదీని తీసుకొచ్చి పొత్తు పెట్టారు. పవన్, మోదీతో పొత్తు పెట్టుకొని సూపర్ సిక్స్ అంటూ లేనిపోని హామీలను చెబుతున్నాడు. బంగారం, బెంజ్ కార్లు అని అంటున్నాడు. ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా వద్దా…? ఈ యుద్ధంలో నేను సిద్ధం. మరీ మీరంతా సిద్ధమేనా…? పేదవాడి భవిష్యత్ కోసం సిద్ధం అని కలిసిరావాలని కోరుతున్నాను. మనకు, చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలిచేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్ గా మారాలి. జరిగిన లబ్ధి గురించి వివరించి చెప్పాలి" అని జగన్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరాలన్నారు.