Chandrababu Bail : చంద్రబాబుకు భారీ ఊరట- ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్-amaravati news in telugu ap high court bail to chandrababu in irr sand liquor cases ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Bail : చంద్రబాబుకు భారీ ఊరట- ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్

Chandrababu Bail : చంద్రబాబుకు భారీ ఊరట- ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్

Bandaru Satyaprasad HT Telugu
Jan 10, 2024 02:59 PM IST

Chandrababu Bail :టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పలు కేసుల్లో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Bail : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. లిక్కర్, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. లిక్కర్, ఐఆర్ఆర్, ఇసుక వ్యవహారాల్లో అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగియగా, తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తాజాగా బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర రోడ్ల అలైన్ మెంట్ మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా కేసు నమోదు చేసింది. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఈ ఏడాది సెప్టెంబరులో పిటిషన్ దాఖలు వేశారు. ఈ పిటిషన్ పై విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

ఇన్నర్ రింగ్‌ రోడ్డుకు కేసుకు సంబంధించిన విచారణలో సీఐడీ బలంగానే వాదనలు వినిపించింది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై సీఐడీ 470పేజీల అడిషనల్ అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయొద్దని వాదించింది. హెరిటేజ్ భూముల కొనుగోలుకు ఇన్నర్ రింగ్‌ రోడ్డుకు సంబంధం ఉందని, అలైన్‌మెంట్‌ మార్పు వివరాలతో కూడిన దాదాపు 200 అంశాలతో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఉచిత ఇసుక పాలసీలో కూడా అక్రమాలు జరిగాయని, వందల కోట్ల ప్రభుత్వ ఆదాయం గండి పడిందంటూ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఏ3గా ఉన్నారు. మద్యం పాలసీలో కూడా అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుల్లో చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ కోర్టులో వాదించింది. అయితే ఈ కేసుల్లో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Whats_app_banner