AP Assigned Lands : అసైన్డ్ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఇకపై మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం!-amaravati news in telugu ap govt revenue department orders on assigned lands compensation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assigned Lands : అసైన్డ్ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఇకపై మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం!

AP Assigned Lands : అసైన్డ్ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఇకపై మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం!

Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2024 04:22 PM IST

AP Assigned Lands : ఏపీ ప్రభుత్వం అసైన్డ్ భూములపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల కోసం అసైన్డ్ భూముల సేకరణ చేస్తే మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది.

ఏపీ అసైన్డ్ భూములు
ఏపీ అసైన్డ్ భూములు

AP Assigned Lands : అసైన్డ్ భూములపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే వాటికి మార్కె్ట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నోటిఫికేషన్ జారీ చేశారు. పేదలు సాగుచేసుకోవడానికి గతంలో ప్రభుత్వం భూములు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని అసైన్డ్ భూములుగా పిలుస్తారు. వీటిని తరాలపాటు సాగుచేసుకోవడానికి మాత్రమే వినియోగించాలి తప్ప క్రయమిక్రయాలకు నిబంధనలు ఒప్పుకోవు.

మార్కెట్ విలువ ప్రకారమే

ఏపీ అసైన్‌మెంట్‌ యాక్ట్-1977కు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీచేశారు. అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఇతర భూముల యజమానులతో సమానంగానే మార్కెట్‌ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని, ఈ విషయంలో సంప్రదింపులకు అవకాశం లేదని తెలిపింది. అయితే భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రజాప్రయోజనాల కోసం భూముల్ని సేకరించినప్పుడు మార్కెట్‌ విలువ కంటే యజమానులు ఎక్కువ డిమాండ్‌ చేస్తే కలెక్టర్‌లు సంప్రదింపులు జరుపుతారు. ఇరువర్గాలకు ఆమోదమైన ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే అసైన్డ్‌ భూముల విషయంలో ఈ తరహా అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో స్పష్టంచేసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన సాగు భూములపై 20 ఏళ్లు, ఇంటి స్థలాలపై 10 సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ జాబితాల్ని స్థానిక ఎమ్మార్వో ప్రకటిస్తారని రెవెన్యూ శాఖ పేర్కొంది.

అర్హుల జాబితా

అయితే అర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించి తుది జాబితాలు నిర్దేశించిన ఫాం-6, ఫాం-7 ద్వారా జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తారని రెవెన్యూ శాఖ పేర్కొంది. కలెక్టర్ ఆమోదిస్తే ఈ భూములను జిల్లా రిజిస్ట్రార్‌ నిషిద్ధ జాబితా (22A) నుంచి తొలగిస్తారని తెలిపింది. తుది జాబితా ప్రకటనకు ముందు అసైన్డ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? పట్టాదారులు పేరిట భూములు ఉన్నాయా? వారసులు ఉన్నారా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అర్హుల జాబితాను ఎమ్మార్వో తయారు చేస్తారని రెవెన్యూ శాఖ పేర్కొంది.

అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు

అసైన్డ్‌ భూములు కేటాయించి (అసైన్‌ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తూ గత ఏడాదిలో ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఈ మేరకు 1977 ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) సవరణను ఆమోదిస్తూ అప్పట్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆర్డినెన్స్‌ జారీచేశారు. దీంతో అసైన్డ్‌ భూములు పొందిన పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించినట్లు అయింది. దాదాపు రాష్ట్రంలో 28 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు అంచనా.

Whats_app_banner