Balakrishna: ఏపీ ఎన్నికల్లో జయం మనదే.. మాటల మనుషులం కాదు: బాలకృష్ణ కామెంట్స్-balakrishna comments on ap elections in legend 10 years event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Comments On Ap Elections In Legend 10 Years Event

Balakrishna: ఏపీ ఎన్నికల్లో జయం మనదే.. మాటల మనుషులం కాదు: బాలకృష్ణ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 29, 2024 03:04 PM IST

Balakrishna AP Elections Legend 10 Years Event: లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకల్లో నందమూరి నటసింహం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ ఎన్నికల్లో తమదే విజయం అంటూ బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్‌లో బాలయ్య బాబు ఇంకా ఏం మాట్లాడారనే వివరాల్లోకి వెళితే..

ఏపీ ఎన్నికల్లో జయం మనదే.. మాటల మనుషులం కాదు: బాలకృష్ణ హాట్ కామెంట్స్
ఏపీ ఎన్నికల్లో జయం మనదే.. మాటల మనుషులం కాదు: బాలకృష్ణ హాట్ కామెంట్స్

Balakrishna About AP Elections 2024: నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో లెజెండ్ ఒకటి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో సింహా మూవీ తర్వాత వచ్చిన రెండో సినిమా ఇది. 2014 మార్చి 28న విడుదలైన ఈ సినిమాను మళ్లీ పదేళ్లకు మార్చి 30న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నికలపై బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.

"చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ సినిమా లెజండ్. సింహ, లెజెండ్, అఖండ, నేలకొండ భగవంత్ కేసరి.. ఈ చిత్రాలన్నీ తృప్తిని ఇవ్వడంతో పాటు ఇంకా మంచి సినిమాలు చేయాలనే కసి పెంచాయి. 2014 ఎలక్షన్స్‌కి ముందు లెజెండ్ విడుదలైయింది. దాని ప్రభావం ఎన్నికలపై ఎంత ఉందో మనకి తెలుసు. మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. యాదృచ్ఛికంగా సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. సినిమా ప్రభావం ఎంత ఉంటుందో రేపు ఎన్నికల్లో చూడబోతున్నారు. జయం మనదే" అని బాలకృష్ణ నమ్మకంగా మాట్లాడారు.

"దర్శకులు బోయపాటి గారు, నేను ఒక సినిమా చేస్తున్నపుడు మరో సినిమా గురించి ఆలోచించం. రేపు జరబోయే సినిమా గురించి కూడా మాట్లాడుకోం. మేము మాటల మనుషులం కాదు. చేసి చూపిస్తాం. మా ఆలోచనలు ఒకటే. రామ్ ప్రసాద్ గారు లెజెండ్ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ ఆణిముత్యాలు లాంటి పాటలు సమకూర్చారు. సాంకేతిక నిపుణులంతా అద్భుతంగా పని చేశారు" అని బాలయ్య బాబు అన్నారు.

"లెజెండ్ మూవీలో సోనాల్ చౌహాన్ అందం అభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే రాధిక ఆప్టే గారు కూడా చక్కని అభినయం కనబరిచారు. జగపతి బాబు గారు తన పాత్రలో చాలా అద్భుతంగా రాణించారు. మిగతా నటీనటులంతా వారి పాత్రల్లో ఒదిగిపోయారు. లెజెండ్ మళ్లీ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి తరమే కాదు నా మనవడి తరానికి కూడా నేను కనెక్ట్ అయినందుకు, నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కళామాతల్లికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని బాలకృష్ణ తెలిపారు.

"హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గా.. ఇలా ఇన్ని పాత్రలు పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాని నాతో పాటు నా సినిమాలని విజయం చేస్తున్న అభిమానులకు, ప్రేక్షకులు, ప్రజలందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. లెజెండ్‌ని అప్పుడు అంత విజయం చేసినందుకు, రేపు చేయబోతునందుకు అభిమానులకు, ప్రేక్షకులకు, తెలుగు చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు" అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

కాగా లెజెండ్ బ్లాక్ బస్టర్ పదేళ్ల వేడుకలో బాలకృష్ణతోపాటు హీరోయిన్ సోనాల్ చౌహన్, నిర్మాతలు, డైరెక్టర్ బోయపాటి శ్రీను పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. మళ్లీ విజయం దక్కించుకునేందుకు ప్రస్తుత సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, పదేళ్లకు మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరికీ వారు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇలాంటి ఎన్నికల వేడి సమయంలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లెజెండ్ రీ రిలీజ్ ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా లేదా అనేది ఎలక్షన్స్ అనంతరం తెలియనుంది.

IPL_Entry_Point