Ganta vs Avanthi : గంటా వర్సెస్ అవంతి - ఈసారి 'భీమిలి' ఎవరిది..?
Ganta Srinivasa Rao Vs Avanthi Srinivas: ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. దాదాపు అభ్యర్థులు ఖరారు కావటంతో… ప్రచారంలోకి దూసుకెళ్లే పనిలో పడ్డాయి పార్టీలు. అయితే విశాఖ జిల్లాలోని భీమిలి వేదికగా ఈసారి అత్యంత ఆసక్తికరమైన పోరుకు తెరలేసింది.
Bhimili Constituency : ఏపీ ఎన్నికల యుద్ధంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే అభ్యర్థుల ఖరారును పూర్తి చేసుకోవటంతో… ప్రచారంలోకి దూసుకెళ్లే పనిలో పడ్డాయి. ఓవైపు వైసీపీ అధినేత జగన్… మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్తుండగా, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక నేటి నుంచి జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా…. ఎలక్షన్ క్యాంపెయినింగ్ షురూ చేయనున్నారు. అయితే ఈసారి ఉత్తరాంధ్రలోని ఓ సీటులో జరగనున్న ఫైట్… అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకే సామాజికవర్గానికి చెందటంతో పాటు మిత్రులు కూడా కావటంతో…. ఆ సెంటర్ లో ఈసారి ఎవరిది పైచేయి అన్న చర్చ జోరుగా నడుస్తోంది.
భీమిలి బరిలో గంటా…
భీమిలి(Bhimili Constituency)…. విశాఖపట్నం జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో ఇక్కడ్నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన సబ్బం హరిపై 9,712 ఓట్ల తేడాలో అవంతి శ్రీనివాస్ గెలిచారు. అయితే 2014లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున గంటా శ్రీనివాస్ గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ 2019లో గంటా స్థానం మారాల్సి వచ్చింది. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా… 1944 స్వల్ప ఓట్ల మెజార్టీతో నెగ్గారు. అయితే ఈసారి మాత్రం భీమిలి టికెట్ కోసమే పట్టుబట్టారు గంటా. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినా… ససేమిరా అనటంతో ఫైనల్ గా గంటా పేరును ఖరారు చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో భీమిలి నుంచే గంటా పోటీ చేయనున్నారు.
హోరాహోరీ పోరు తప్పదా…!
ఈసారి వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas) బరిలో ఉండగా... టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ ఖరారయ్యారు. దీంతో ఇక్కడ హోరాహోరీ పోరు జరగనుంది. వీరిద్దరూ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతలే. పైగా ఇద్దరూ కూడా మంత్రులుగా పని చేశారు. ఇద్దరూ కూడా ప్రజారాజ్యం పార్టీలో చేశారు. ఆ తర్వాత టీడీపీలో కూడా ఉన్నారు. వీరిద్దరూ గురు శిష్యులుగా గుర్తింపు పొందారు. కానీ ప్రస్తుతం వీరిద్దరూ వేర్వురు పార్టీల్లో ఉన్నారు. ఇక ఏపీలో కాపు సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో భీమిలి ఒక్కటి. ఇద్దరూ కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేతలు కావటంతో… ఇక్కడి ఫైట్ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక నియోజకవర్గంలో అత్యధికంగా యాదవ, మత్స్యకార సామాజికవర్గ ఓటర్లు కూడా ఉన్నారు. వీరి ఓట్లు అత్యంక కీలకంగా మారనున్నాయి. అయితే పొత్తులో భాగంగా… జనసేన ఓట్లు ఈసారి అదనంగా కలిసివస్తాయని గంటా భావిస్తుండగా… సంక్షేమం, అభివృద్ధి నినాదంతో అవంతి కూడా ధీమాగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన అవంతి శ్రీనివాస్.. భీమిలో గెలిచారు. ఫలితంగా ఈ స్థానం నుంచి రెండు సార్లు అవంతి గెలవగా…ఒక్కసారి గంటా గెలిచారు. అయితే ఈసారి నేరుగా తలపడనున్న పోరులో…. ఎవరు గెలుస్తారనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది.