Nara Lokesh Padayatra : డిసెంబర్ 17న లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు-భీమిలిలో పవన్, చంద్రబాబుతో భారీ బహిరంగ సభ!
Nara Lokesh Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర డిసెంబర్ 17న భీమిలిలో ముగియనుంది. ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పాదయాత్ర ముగించనున్నట్లు తెలుస్తోంది.
Nara Lokesh Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబర్ 17న భీమిలిలో ముగియనుంది. ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందు లోకేశ్ పాదయాత్రను ముగించనున్నట్లు తెలుస్తోంది. జనవరిలో కుప్పంలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భీమిలిలో పవన్, చంద్రబాబుతో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు.
215వ రోజు పాదయాత్ర
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. కాకినాడ రూరల్ తిమ్మాపురం క్యాంప్ సైట్ నుంచి 215వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్... పెద్దాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. చిత్రాడ వద్ద పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ కు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా వెయ్యి మందితో ఫోటోలు దిగారు. రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన జనం... లోకేశ్ కు స్వాగతం పలికారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలు ఎక్కిన ప్రజలు లోకేశ్ కు అభివాదం చేశారు.
లోకేశ్ ను కలిసిన ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం సెంటర్ లో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్స్, లెక్చరర్లు 4 లక్షల మంది ఉన్నామని, అరకొర జీతాలతో జీవనం సాగిస్తున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని ప్రైవేట్ టీచర్లు వేడుకున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. ప్రతి ప్రైవేటు టీచర్ కు రూ.12 వేలు కనీస జీతం ఇప్పించాలన్నారు. ప్రైవేటు టీచర్లకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి, నిధి ఏర్పాటు చేసి మరణించిన వారి కుటుంబాలకు బీమా కల్పించాలని లోకేశ్ ను కోరారు. ప్రైవేట్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.
జే ట్యాక్స్ కోసం వేధింపులు
నారా లోకేశ్ స్పందిస్తూ... జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆరోపించారు. రకరకాల నిబంధనలు విధించి ప్రైవేటు విద్యాసంస్థలను జే ట్యాక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి వేధించి వసూళ్లు చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కూలీపనులకు వెళ్లిన ఘటనలు కూడా చూశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ టీచర్లకు ఈఎస్ఐ, పీఎఫ్, బీమా వంటి సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.