Janasena Glass Symbol : జనసేనకు ఈసీ షాక్, ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్!
Janasena Glass Symbol : ఎన్నికల ముందు జనసేనకు గట్టి షాక్ తగిలింది. జనసేనకు ఫ్రీ సింబల్ గా గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేనను ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు ఈసీ.
Janasena Glass Symbol : ఏపీలో ఎన్నికల (AP Elections)హీట్ పెరుగుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ముందు జనసేనకు ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. జనసేనను ఈసీ రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు(Janasena) ఫ్రీ సింబల్ గా గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీ(EC) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
జనసేన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే
కేంద్ర ఎన్నికల సంఘం(EC) గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాలను మంగళవారం విడుదల చేసింది. ఈసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైసీపీ, టీడీపీ ఉండగా జనసేనను(Janasena) రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించింది. వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు కేటాయించింది ఈసీ. అయితే జనసేనకు ఫ్రీ సింబల్(Free Symbol) గ్లాసు గుర్తును(Glass Symbol) కేటాయించింది. జనసేనను ఈసీ ప్రాంతీయ పార్టీ గుర్తించకపోవడం విశేషం. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఇలా
జనసేన పార్టీకి కేంద్రం ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును(Janasena Glass Tumbler) కేటాయించిందని ఆ పార్టీ లీగల్ సెల్ జనవరిలో ప్రకటించింది. ఈసీ జనసేనకు గ్లాస్ గుర్తుని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించారని అప్పట్లో జనసేన(Janasena) ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే తాజాగా ఈసీ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో... సందిగ్ధం నెలకొంది. జనసేన పోటీలో లేని చోట గ్లాస్ సింబల్ ను ఇతర అభ్యర్థులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇది జనసేనతో పాటు కూటమి పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపనుంది. ఈ విషయంపై జనసేన లీగల్ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామంపై పవన్ కల్యాణ్ లీగల్ సెల్ నిపుణులతో ఎలా ముందుకు వెళ్లాలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం