Janasena Glass Tumbler : జనసేన పార్టీకి కేంద్రం ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈసారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తుపైనే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారని జనసేన తెలిపింది. ఈసీ ఉత్తర్వు కాపీలను జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ బుధవారం పవన్ కల్యాణ్ కు అందజేశారు. ఈసీ నిర్ణయంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో పర్యటించింది. ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘం కలిసి జనసేనకు కామన్ సింబల్ కేటాయించవద్దని ఫిర్యాదు చేశారు. గ్లాస్ సింబల్ సాధారణ గుర్తు అని, సాధారణ గుర్తు కలిగిన జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధమన్నారు. కానీ తాజాగా ఈసీ జనసేనకు కామన్ సింబల్ గా గాజు గ్లాస్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
సినీనటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు. పవన్ వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్, పృథ్వీరాజ్ చేరికపై పలువురు జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్.. పృథ్వీరాజ్, జానీ మాస్టర్ కు సూచించారు. జనసేన అధ్యక్షుడు పవన్ లో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయ, సామాజిక అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.