Womens T20 World Cup Semi Finals: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో సెమీస్‌కి చేరిన 4 జట్లు ఇవే, భారత్‌తో పాటు 5 జట్లు ఇంటికి
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆఖరి దశకి చేరుకుంది. టోర్నీలో 10 జట్లు పోటీపడితే నాలుగు జట్లు సెమీస్‌కి అర్హత సాధించాయి. భారత్, పాకిస్థాన్‌తో పాటు మరో 4 జట్లు ఇంటిబాట పట్టాయి.
యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 చరమాంకానికి చేరుకుంది. టోర్నీలో మొత్తం 10 దేశాల జట్లు పోటీపడగా.. ఇందులో నాలుగు జట్లు సెమీస్‌కి అర్హత సాధించాయి. మిగిలిన 6 జట్లు ఇంటిబాటపట్టాయి. ఈ ఆరు జట్లలో భారత్ ఉమెన్స్ టీమ్ కూడా ఉంది.
గ్రూప్-ఎలో భారత్ నిరాశ
గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీపడగా.. ప్రతి జట్టూ మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. ఇందులో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆస్ట్రేలియా (8 పాయింట్లు), మూడింటిలో గెలిచిన న్యూజిలాండ్ (6 పాయింట్లు) సెమీస్‌కి అర్హత సాధించాయి.
గ్రూప్-ఎలో ఇక మిగిలిన భారత్ రెండు విజయాలతో 4 పాయింట్లు, పాకిస్థాన్ ఒక విజయంతో 2 పాయింట్లు మాత్రమే సాధించాయి. ఇక శ్రీలంక టీమ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి గెలుపు రుచి చూడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్-బిలో ఇంగ్లాండ్ బ్యాడ్ లక్
గ్రూప్-బిలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ టీమ్స్ పోటీపడ్డాయి. ఈ గ్రూప్ నుంచి మూడేసి విజయాలతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సెమీస్‌కి అర్హత సాధించాయి. వాస్తవానికి ఇంగ్లాండ్ టీమ్ కూడా మూడు విజయాలు సాధించింది.
కానీ.. పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (+1.382) నెట్ రన్‌రేట్‌తో పోలిస్తే ఇంగ్లాండ్ (+1.091) రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఆ జట్టుకి నిరాశ తప్పలేదు. ఇక మిగిలిన బంగ్లాదేశ్ టీమ్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందగా.. స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
సెమీస్ షెడ్యూల్ ఇలా
ఓవరాల్‌గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కి అర్హత సాధించాయి. దాంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అక్టోబరు 17 (గురువారం) సెమీ ఫైనల్ -1 మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుండగా.. అక్టోబరు 18 (శుక్రవారం) వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్-2 మ్యాచ్ షార్జా వేదికగా జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకి ప్రారంభంకానున్నాయి. ఆఖరిగా ఫైనల్ మ్యాచ్ అక్టోబరు 20 (ఆదివారం) దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకి జరగనుంది.