Funny Moment in Hyderabad T20: తికమకలో ఒకే ఎండ్‌కి హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్, అయినా రనౌట్ చేయలేకపోయిన బంగ్లాదేశ్
India vs Bangladesh 3rd T20: రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా కొన్ని క్షణాల పాటు ఒకే ఎండ్‌లో ఉండిపోయారు. బంతి చేతుల్లో ఉన్నా బంగ్లాదేశ్ టీమ్ రనౌట్ చేయలేకపోయింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఒక ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన బంగ్లాదేశ్ టీమ్ 164/7కే పరిమితమైంది. దాంతో 133 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ టీమ్ పర్యటన కూడా ముగిసింది.
బంతి చూస్తుండిపోయిన హార్దిక్
మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 18వ ఓవర్ బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ మూడో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా సంధించాడు. ఆ బంతిని హిట్ చేసేందుకు హార్దిక్ పాండ్యా ప్రయత్నించినా.. బంతి సరిగా కనెక్ట్ కాలేదు. థిక్ ఎడ్జ్ తీసుకుని వికెట్లకి కొంచెం దూరం వెళ్లి ఆగిపోయింది. దాంతో హార్దిక్ పాండ్య ఆ బంతిని చూస్తూ ఉండిపోయాడు.
లేని పరుగు కోసం పిలుపు
హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండి ఆ బంతిని చూస్తుండగానే.. నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి రియాన్ పరాగ్ పరుగు కోసం పిలుస్తూ క్రీజులోని హార్దిక్ పాండ్యా దగ్గరికి వచ్చేశాడు. దాంతో దొరికిందే ఛాన్స్‌గా రనౌట్ కోసం బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ఆ బంతిని అందుకుని బౌలర్ ముస్తాఫిజుర్‌కి ఇచ్చే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్యా రనౌట్ నుంచి తప్పించుకునేందుకు నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు పరుగెత్తాడు. అదే సమయంలో అనూహ్యంగా రియాన్ పరాగ్ కూడా నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు పరుగెత్తాడు. దాంతో గజిబిజి గందరగోళంగా పరిస్థితి మారింది.
బంగ్లా కీపర్ త్రో ఫెయిల్
బంతిని అందుకున్న లిట్టన్ దాస్.. బౌలర్ ముస్తాఫిజుర్‌కి బంతిని సరిగా త్రో చేయడంలో ఫెయిలయ్యాడు. బంతి అతని తలమీదు నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో అక్కడికి కెప్టెన్ శాంటో ఆ బంతిని అందుకునేందుకు వచ్చినా.. అతనూ ఫెయిలయ్యాడు. దాంతో హార్దిక్ పాండ్యా తికమకలోనే ఎట్టకేలకి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజులోకి చేరుకున్నాడు.
పరాగ్ అప్పటికే ఒక ఛాన్స్
మ్యాచ్‌లో అప్పటికే సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల మోతతో ఒత్తిడిలో పడిపోయిన బంగ్లాదేశ్ టీమ్.. గెలుపుపై ఆశలు వదిలేసినట్లు కనిపించింది. ఆ జట్టులో ఉత్సాహమే కనిపించలేదు. వాస్తవానికి ఈ రనౌట్ ఛాన్స్ చేజారక ముందు కూడా ఒకసారి రియాన్ పరాగ్ ఇలానే తడబాటుకి గురై పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. కానీ.. అప్పుడు కూడా బంగ్లాదేశ్ అతడ్ని రనౌట్ చేయలేకపోయింది. ఓవరాల్‌గా భారత్ గడ్డపై రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడిన బంగ్లాదేశ్ టీమ్.. గెలుపు రుచి చూడకుండానే స్వదేశానికి పయనమైంది.