Pak W vs NZ W: న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఇండియా వుమెన్స్ టీమ్ ఔట్
Pak W vs NZ W: మహిళల టీ20 వరల్డ్ కప్ నుంచి ఇండియన్ టీమ్ సెమీస్ చేరకుండానే ఇంటికెళ్లిపోయింది. న్యూజిలాండ్ వుమెన్స్ టీమ్ చేతుల్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడంతో హర్మన్‌ప్రీత్ సేన లీగ్ స్టేజ్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.
Pak W vs NZ W: ఇండియన్ వుమెన్స్ టీమ్ ఆశలను వమ్ము చేసింది పాకిస్థాన్. మన టీమ్ మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్ ను కచ్చితంగా ఓడించాల్సి ఉండగా.. ఆ జట్టు చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. 111 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక కేవలం 56 పరుగులకే కుప్పకూలి 54 పరుగుల తేడాతో చిత్తయింది.
కొంప ముంచిన పాకిస్థాన్ వుమెన్స్ టీమ్
ఆదివారం (అక్టోబర్ 13) ఆస్ట్రేలియా వుమెన్స్ టీమ్ చేతుల్లో ఓడిన తర్వాత ఇండియన్ టీమ్ ఆశలన్నీ పాకిస్థాన్ పై పెట్టుకుంది. ఆ టీమ్ న్యూజిలాండ్ ను ఓడిస్తే.. ఇండియాకు సెమీస్ చేరే అవకాశం ఉండేది. కానీ అదే న్యూజిలాండ్ చేతుల్లో పాక్ టీమ్ చిత్తు చిత్తుగా ఓడింది. 54 పరుగుల తేడాతో పాకిస్థాన్ వుమెన్స్ టీమ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరింది.
111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ టీమ్.. 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లు అమేలియా కెర్ 3, ఈడెన్ కార్సన్ 2 వికెట్లు తీసుకున్నారు. పాక్ టీమ్ లో కెప్టెన్ ఫాతిమా సనా 21 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచింది. ఓపెనర్ మునీబా అలీ (15) కూడా రెండంకెల స్కోరు అందుకుంది.
పాక్ టీమ్ లో ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. తక్కువ లక్ష్యమే అయినా ఏ దశలోనూ పాక్ టీమ్ చేజ్ చేసేలా కనిపించలేదు. 7 పరుగుల దగ్గరే తొలి వికెట్ కోల్పోయిన పాక్.. చివర్లో 4 పరుగుల తేడాలో చివరి ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. 56 పరుగుల దగ్గరే చివరి మూడు వికెట్లూ పడ్డాయి.
సెమీస్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
ఈ విజయంతో గ్రూప్ ఎ నుంచి న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరింది. ఇంతకు ముందే ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో టాప్ లో నిలిచి సెమీస్ లో అడుగుపెట్టింది.
ఇండియన్ టీమ్ 4 మ్యాచ్ లలో రెండు, రెండింట్లో ఓడి 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ టీమ్ 4 మ్యాచ్ లలో మూడు గెలిచి, ఒకటి ఓడి ఆరు పాయింట్లతో సెమీఫైనల్ చేరింది. గ్రూప్ బిలో సెమీస్ బెర్తులు ఇంకా తేలలేదు.
మంగళవారం (అక్టోబర్ 15) మ్యాచ్ లతో మరో రెండు సెమీఫైనల్ బెర్తులు ఖాయం కానున్నాయి. ప్రస్తుతం ఆ గ్రూపులో ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఆరేసి పాయింట్లతో టాప్ 2లో ఉన్నా.. వెస్టిండీస్ కు కూడా ఇంకా అవకాశం ఉంది. చివరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గెలిస్తే.. వెస్టిండీస్ వుమెన్ టీమ్ సెమీస్ చేరుతుంది.