INDW vs AUSW: హర్మన్ పోరాడినా ఆసిస్ చేతిలో టీమిండియా ఓటమి.. ప్రపంచకప్ సెమీస్ ఛాన్స్ ఇంకా ఉందా?
INDW vs AUSW: మహిళల టీ20 ప్రపంచకప్‍లో కీలక మ్యాచ్‍లో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిపోయింది. టీమిండియా కెప్టెన్ హర్మన్‍ప్రీత్ సింగ్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే, సెమీస్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి.
మహిళల టీ20 ప్రపంచకప్‍లో భారత్‍కు మరో ఎదురుదెబ్బ తగిలిగింది. సెమీస్ చేరాలంటే గెలుపు ముఖ్యమైన మ్యాచ్‍లో టీమిండియా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. షార్జా వేదికగా నేడు (అక్టోబర్ 13) జరిగిన తన గ్రూప్-ఏ చివరి మ్యాచ్‍లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఆసిస్‍పై పరాజయం చెందింది. భారత కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్ అజేయ అర్ధ శకతంతో చివరి వరకు పోరాడారు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవటంతో మ్యాచ్ చేజారింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రేస్ హరిస్ (40), కెప్టెన్ తహిల మెక్‍గ్రాత్ (32), ఎలీస్ పెర్రీ (32) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధాయాదవర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
హర్మన్ వీరోచితంగా పోరాడినా..
152 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభంలో టీమిండియా తడబడింది. దూకుడుగా ఆడిన షఫాలీ వర్మ (13 బంతుల్లో 20 పరుగులు) నాలుగో ఓవర్లో ఔటయ్యారు. ఓపెనర్ స్మతి మంధాన (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టారు. జెమీమా రోడ్రిగ్స్ (16) కూడా ఎక్కువసేపు నిలువలేదు.
అయితే, కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 54 పరుగులు నాటౌట్; 6 ఫోర్లు) ధీటుగా ఆడారు. ఆమెకు దీప్తి శర్మ (29) సహకరించారు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడారు. దీంతో భారత్ గెలిచేలా కనిపించింది. కాసేపటికి హర్మన్ దూకుడు పెంచారు. అయితే 16వ ఓవర్లో దీప్తి శర్మ, ఆ తర్వాతి ఓవర్లో రిచా ఘోష్ (1) ఔవటంతో మళ్లీ పరిస్థితి మారిపోయింది.
చివరి ఓవర్లో నాలుగు వికెట్లు
ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా హర్మన్ పోరాడారు. పరుగులు రాబట్టారు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరారు. చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 14 ఓవర్లు అవసరమయ్యాయి. ఆ ఓవర్‌ను ఆస్ట్రేలియా బౌలర్ సదర్లాండ్ వేశారు. తొలి బంతికి హర్మన్ సింగిల్ తీశారు. ఆ తర్వాత పూజా వస్త్రాకర్ (9), అరుంధతి (0) వెంటవెంటనే ఔటయ్యారు. శ్రేయాంక పాటిల్ రనౌట్ అయ్యారు. ఐదో బంతికి రాధా యాదవ్ ఔటయ్యారు. హర్మన్ చివరి వరకు పోరాడి నాటౌట్‍గా నిలిచినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో సదర్లాండ్, సోఫీ మాలినెక్స్ తలా రెండు వికెట్లతో రాణించారు.
సెమీస్ చేరాలంటే - పాక్‍పై భారత్ ఆశలు
మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్ 4 గ్రూప్ మ్యాచ్‍లు ఆడేసింది. 2 గెలిచి. 2 ఓడి 4 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో ప్లేస్‍లో ఉంది. రేపు న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య గ్రూప్-ఏ చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో పాకిస్థాన్ గెలిస్తే.. భారత్‍కు సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే, పాకిస్థాన్ భారీగా కాకుండా మోస్తరు తేడాతో గెలువాలి. పాక్ గెలిస్తే నెట్ రన్‍రేట్ కీలకమవుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే.. ఆ జట్టు సెమీస్ చేరి భారత్ ఔట్ అయ్యే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‍కు అర్హత సాధించింది. మొత్తంగా టీమిండియా సెమీస్ చేరాలంటే రేపు (అక్టోబర్ 14) న్యూజిలాండ్‍పై పాకిస్థాన్ మోస్తరు తేడాతో గెలువాలి. దీంతో పాక్‍పై టీమిండియా ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.