Virat Kohli: ఇంగ్లాండ్ సిరీస్ మొత్తం ఆడనని బీసీసీఐకి చెప్పేసిన విరాట్ కోహ్లీ.. రాహుల్, రవీంద్ర ఎంట్రీ
Virat Kohli Informs BCCI About England Test: భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో తాజాగా పెద్ద షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. పూర్తి వివరాల్లోకి వెళితే..
Virat Kohli BCCI England Test Series: ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో భారత్ టెస్ట్ సిరీస్ నడుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీసులో తొలి రెండు టెస్టుల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో విరాట్ వైదొలిగినట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే నిర్ధిష్టమైన కారణాన్ని ఎవరు వెల్లడించలేదు. ఇక ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులోకి వస్తాడా లేదా అనే విషయం ఉత్కంఠంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ కోహ్లీ పెద్ద షాక్ ఇచ్చాడు. భారత్-ఇంగ్లాండ్ సిరీస్ మొత్తానికే తాను అందుబాటులో ఉండలేను అని విరాట్ కోహ్లీ శుక్రవారం (ఫిబ్రవరి 9) బీసీసీఐ సెలక్టర్లకు సమాచారం అందించాడు. ఇదివరకు చెప్పినట్లుగానే వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ అధికారులకు, సెలక్షన్ కమిటీకి, భారత జట్టు మేనేజ్మెంట్‌కు విరాట్ తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఇదే కారణంతో హైదరాబాద్, విశాఖపట్నంలో జరిగిన తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. మూడు, నాలుగో టెస్టులకు దూరంగా ఉండనున్న కోహ్లీ ఇంకా బీసీసీఐ అధికారులను సంప్రదించలేదని, అయితే శుక్రవారం అతను అందుబాటులో లేనట్లు సెలక్టర్లకు సమాచారం అందించాడని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. సిరీస్ ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లో జరిగిన భారత తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న కోహ్లీ అదే రోజు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లకు తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు తెలియజేశాడు.
ఆ మరుసటి రోజే భారత మాజీ కెప్టెన్ విరాట్ ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు, సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ గౌరవిస్తున్నాయని, అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అరంగేట్రం తర్వాత కోహ్లీ సొంతగడ్డపై ఒక్క టెస్టు కూడా ఆడకపోవడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వ్యక్తిగత ప్రతిభపైనే ఎక్కువగా ఆధారపడి భారీ పరుగుల కోసం సతమతమవుతున్న భారత బ్యాటింగ్ విభాగానికి ఇది పెద్ద దెబ్బ అని వేరే చెప్పనవసరం లేదు.
అయితే, వేరే దేశంలో టూర్‌లో ఉన్న 35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంకా స్వదేశానికి తిరిగి రాలేదని తెలుస్తోంది. అందుకే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి మొత్తంగా వైదొలగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. వెన్నునొప్పి, గజ్జ గాయం కారణంగా బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ రాజ్ కోట్, రాంచీ, ధర్మశాలలో జరిగే మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో విశాఖపట్నంలో ఎంట్రీ ఇచ్చిన రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరూ జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు.
గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి టెస్టు అనంతరం వీరిద్దరినీ ఎన్సీఏకు పంపించారు. రాహుల్ త్వరగా ఫిట్‌నెస్ సాధించగా.. జడేజా ఆరోగ్యానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ కోసం వేచిచూడాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు ముందు ఈ ఆల్ రౌండర్ ఫిట్‌గా ఉంటాడని సెలెక్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి జడేజాకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. జడేజా ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లు స్పష్టత ఇవ్వాలనుకోవడంతో జట్టు ప్రకటన రెండు రోజులు ఆలస్యమైంది. మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా భారత పేసర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.