Virat Kohli: ఇదీ కోహ్లీ అంటే.. నవీనుల్‍ను గేలి చేయవద్దని ప్రేక్షకులకు సూచన: విరాట్‍తో నవ్వుతూ మాట్లాడిన అఫ్గాన్ బౌలర్
Virat Kohli: అఫ్గానిస్థాన్ పేసర్ నవీనుల్ హక్‍ను గేలి చేయవద్దని ప్రేక్షకులకు సూచించాడు భారత స్టార్ విరాట్ కోహ్లీ. ఈ ఏడాది ఐపీఎల్‍లో విరాట్‍తో నవీన్ వాగ్వాదానికి దిగటంతో ఆగ్రహంగా ఉన్న ప్రేక్షకులు నవీన్‍ను ట్రోల్ చేశారు. దీంతో కోహ్లీ సూచన చేశాడు.
Virat Kohli IND vs AFG: ఈ ఏడాది ఐపీఎల్‍లో భారత స్టార్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ పేసర్ నవీనుల్ హక్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ మాటకు మాట అనుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కొన్ని పోస్టులు పెట్టాడు నవీనుల్. దీంతో కోహ్లీతో గొడవ పెట్టుకుంటావా అంటూ క్రికెట్ అభిమానులు నవీనుల్‍పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే, ఆ గొడవకు నేడు ఫుల్‍స్టాప్ పడేలా చేశాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య నేడు (అక్టోబర్ 11) మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా కోహ్లీ దగ్గరికి వచ్చిన నవ్వుతూ చేయి కలిపాడు నవీనుల్ హక్. అలాగే, నవీనుల్‍ను గేలి (ట్రోల్) చేయద్దంటూ స్టేడియంలోని ప్రేక్షకులకు కోహ్లీ సూచించాడు. ఆ వివరాలివే..
లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేసి 26వ ఓవర్లో ఔటయ్యాడు. ఆ సందర్భంలో నవీనుల్ హక్.. విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లాడు. విరాట్‍కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెంటనే కోహ్లీ కూడా నవ్వి.. నవీనుల్‍ను భుజంపై తట్టాడు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. హగ్ చేసుకున్నారు. దీంతో ఐపీఎల్ ద్వారా వారి ఏర్పడిన గ్యాప్ తొలగిపోయినట్టే. కోహ్లీ దగ్గరికి వచ్చి నవీనుల్ మంచి స్ఫూర్తి చూపాడు. అంతులేని స్టార్ డమ్ ఉన్న కోహ్లీ ఏ మాత్రం గర్వం లేకుండా అతడితో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడాడు.
బౌలింగ్ చేస్తున్న సమయంలో “కోహ్లీ..కోహ్లీ” అంటూ నవీనుల్‍ను ఢిల్లీ స్టేడియంలోని కొందరు ప్రేక్షకులు గేలి చేస్తుండడాన్ని విరాట్ కోహ్లీ గమనించాడు. దీంతో అలా చేయవద్దంటూ ప్రేక్షకులకు సూచించాడు. అలా ట్రోల్ చేయవద్దు అంటూ చేయి ఊపుతూ ప్రేక్షకులకు సూచనలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విరాట్ కోహ్లీ అంటే ఇదీ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ మనసు చాలా గొప్పది అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. గతంలో బాల్‍ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‍ను ప్రేక్షకులు ‘చీటర్.. చీటర్’ అంటే అలా అనొద్దని కోహ్లీ సూచించాడు. అందరి మనసులను గెలిచాడు. ఇప్పుడు మరోసారి నవీనుల్ హక్‍ను కూడా ట్రోల్ చేయవద్దని ప్రేక్షకులకు సూచించి.. మరోసారి ఔన్నత్యాన్ని కోహ్లీ చాటుకున్నాడు.
కాగా, ఈ మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్‍పై 8 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (131) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ (55 నాటౌట్) అజేయ అర్ధ శతకం సాధించాడు. 90 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి 273 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది.
సంబంధిత కథనం