IND vs AFG World Cup: అఫ్గాన్‍పై భారత్ గ్రాండ్ విజయం.. మెరుపు సెంచరీతో రోహిత్ శర్మ విశ్వరూపం-india beat afghanistan in odi world cup 2023 as rohit sharma hits record breaking century ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Afg World Cup: అఫ్గాన్‍పై భారత్ గ్రాండ్ విజయం.. మెరుపు సెంచరీతో రోహిత్ శర్మ విశ్వరూపం

IND vs AFG World Cup: అఫ్గాన్‍పై భారత్ గ్రాండ్ విజయం.. మెరుపు సెంచరీతో రోహిత్ శర్మ విశ్వరూపం

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 11, 2023 10:52 PM IST

IND vs AFG ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో అఫ్గానిస్థాన్‍పై టీమిండియా అలవోక విజయాన్ని సాధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ శకతంతో దుమ్మురేపాడు.

IND vs AFG World Cup: అఫ్గాన్‍పై భారత్ గ్రాండ్ విజయం.. మెరుపు సెంచరీతో రోహిత్ శర్మ విశ్వరూపం
IND vs AFG World Cup: అఫ్గాన్‍పై భారత్ గ్రాండ్ విజయం.. మెరుపు సెంచరీతో రోహిత్ శర్మ విశ్వరూపం (PTI)

IND vs AFG ODI World Cup 2023: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍లో భారత్ వరుసగా రెండో గెలుపును సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో అఫ్గానిస్థాన్‍పై సునాయస విజయాన్ని అందుకుంది టీమిండియా. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు (అక్టోబర్ 11) జరిగిన మ్యాచ్‍లో భారత్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‍పై గెలిచింది. ఏకంగా 90 బంతులను మిగిల్చి విజయం సాధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (84 బంతుల్లో 131 పరుగులు; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో అదరగొట్టాడు. దీంతో 35 ఓవర్లలోనే 2 వికెట్లకు 273 పరుగులు చేసి విజయం సాధించింది భారత్. విరాట్ కోహ్లీ (56 బంతుల్లో 55 పరుగులు నాటౌట్) అర్ధ శతకంతో అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (47) రాణించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ రషీద్‍ ఖాన్‍కు మాత్రమే రెండు వికెట్లు దక్కాయి. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఈ గెలుపుతో టీమిండియా ప్రస్తుతం ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. భారత్, అఫ్గాన్ మ్యాచ్ ఎలా సాగిందంటే..

హిట్‍మ్యాన్ వీరవిహారం

273 రన్స్ మోస్తరు లక్ష్యఛేదనలో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ప్రారంభం నుంచి భీకర హిట్టింగ్‍తో రెచ్చిపోయాడు. బౌండరీల మోత మోగించి.. అఫ్గానిస్థాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. దీంతో కేవలం 30 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ విజృంభణతో భారత్ స్కోరు 11.5 ఓవర్లలోనే 100 పరుగులకు చేరింది. మరో ఎండ్‍లో ఇషాన్ కిషన్.. హిట్‍మ్యాన్‍కు సహకరించాడు.

అర్ధ శకతం తర్వాత రోహిత్ శర్మ మరింత విజృంభించాడు. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‍ను కూడా దూకుడుగానే ఆడాడు. ఏ బౌలర్ వచ్చినా బౌండరీల రుచి చూపాడు. దీంతో 63 బంతుల్లోనే రోహిత్ సెంచరీకి చేరుకున్నాడు. ఏడు ప్రపంచకప్‍ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఇషాన్ కిషన్ 19వ ఓవర్లో ఔటవటంతో 156 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

సెంచరీ తర్వాత కూడా రోహిత్ శర్మ జోరు చూపాడు. అయితే, 26వ ఓవర్లో రషీద్ బౌలింగ్‍లో స్వీప్ షాట్‍కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఇక భారత్‍ను గెలుపు తీరానికి చేర్చే బాధ్యతను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భుజాన వేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌(25 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఈ క్రమంలో 55 బంతుల్లో అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 35 ఓవర్లలోనే భారత్ విజయం సాధించింది.

అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది అఫ్గానిస్థాన్. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్ జాయ్ (62) అర్ధ శకతకాలతో రాణించటంతో అఫ్గాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. హార్దిక్ పాండ్యా రెండు తీసుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం