IND vs AFG World Cup: రాణించిన ఆప్ఘనిస్థాన్.. టీమిండియాకు దీటైన టార్గెట్
IND vs AFG World Cup: టీమిండియాతో మ్యాచ్‍లో ఆఫ్ఘనిస్థాన్ రాణించింది. ఇద్దరు బ్యాటర్లు అర్ధ శతకాలతో అదరగొట్టారు. దీంతో మోస్తరు లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది ఆఫ్ఘన్.
IND vs AFG ODI World Cup 2023: బలమైన టీమిండియా బౌలింగ్‍ను తట్టుకొని తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ మెరుగైన స్కోరు చేసింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా భారత్, ఆప్ఘనిస్థాన్ మధ్య నేడు (అక్టోబర్ 11) ఢిల్లీ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80 పరుగులు), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (62 పరుగులు) అర్ధ శకతాలతో రాణించి.. ఆప్ఘనిస్థాన్‍కు పోరాడే స్కోరు అందించారు. భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకోగా.. శార్దూల్ ఠాకూర్, కుల్‍దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. టీమిండియా ముందు 273 పరుగుల లక్ష్యం ఉంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ఆప్ఘనిస్థాన్‍కు రహ్మానుల్లా గుర్బాజ్ (21), ఇబ్రహీం జర్దాన్ (22) మంచి ఆరంభమే ఇచ్చారు. కాగా, ఏడో ఓవర్లో జర్దాన్‍ను ఔట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా. గుర్బాజ్‍ను హార్దిక్ పాండ్యా, రహ్మత్ షా (16)ను శార్దూల్ ఔట్ చేశారు. దీంతో 63 పరుగులకే ఆఫ్ఘన్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్ జాయ్ నిలకడగా ఆడారు. జట్టును ఆదుకున్నారు.
షాహిది, అజ్మతుల్లా క్రమంగా పరుగులు రాబట్టారు. వికెట్ కాపాడుకుంటూనే క్రమంగా పరుగులు చేశారు. దీంతో 31 ఓవర్లలో 150 పరుగులకు ఆఫ్ఘన్ స్కోరు చేరింది. ఈ క్రమంలో 62 బంతుల్లో అర్ధ శకతం చేశాడు అజ్ముతుల్లా ఒమర్ జాయ్. 58 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరాడు షాహిది. ఒమర్ జాయ్‍ను ఔట్ చేసి బ్రేక్‍త్రూ ఇచ్చాడు భారత పేసర్ హార్దిక్. 121 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత కాసేపు దూకుడుగా ఆడిన షాహిదిని భారత స్పిన్నల్ కుల్‍దీప్ ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. చివర్లో రషీద్ ఖాన్ (16), ముజీబుర్ రహ్మన్ (10 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. మహమ్మద్ నబీ (19) వేగంగా ఆడలేకపోయాడు. మొత్తంగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 రన్స్ చేసింది ఆప్ఘన్.