Virat Kohli RCB: ఒకే ఒక్కడు విరాట్ కోహ్లి.. 16 ఏళ్లుగా ఆర్సీబీతోనే.. కేజీఎఫ్ స్టైల్లో థ్యాంక్స్ చెప్పిన ఫ్రాంఛైజీ
Virat Kohli RCB: ఐపీఎల్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేజీఎఫ్ స్టైల్లో విషెస్ చెప్పింది. అతడు ఆర్సీబీలోకి వచ్చి 16 ఏళ్లు పూర్తయ్యాయి.
Virat Kohli RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సోమవారం (మార్చి 11) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమ ఫ్రాంఛైజీ పట్ల కోహ్లి ఎంత నమ్మకంగా ఉన్నాడో చెబుతూ ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. సరిగ్గా ఈరోజుకు ఆర్సీబీ ఫ్రాంఛైజీతో విరాట్ కోహ్లి చేరి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ట్వీట్ చేశారు.
ఒకే ఒక్కడు విరాట్ కోహ్లి
ఐపీఎల్ చరిత్రలో మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకూ ఒకే ఫ్రాంఛైజీకి ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లియే. అతడు మార్చి 11, 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో చేరాడు. అప్పటి నుంచీ మొత్తం 16 సీజన్లు ఆ జట్టుకే అతడు ఆడాడు. ఆ ఏడాది అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన కోహ్లి.. తమ జట్టును విశ్వవిజేతను చేశాడు.
దీంతో డ్రాఫ్ట్ పద్ధతిలో అండర్ 19 జట్టులోని ప్లేయర్స్ ను ఎంచుకునే అవకాశం ఫ్రాంఛైజీలకు బీసీసీఐ కల్పించింది. అప్పుడు విరాట్ కోహ్లిని ఆర్సీబీ తమ టీమ్ లోకి తీసుకుంది. అప్పట్లో కేవలం 30 వేల డాలర్లకు విరాట్ తో ఆర్సీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 16 ఏళ్లలో క్రికెట్ ప్రపంచంలోని ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో ఒకడిగా విరాట్ ఎదిగాడు.
అయినా ఇంత వరకూ అతడు ఆర్సీబీని మాత్రం వదల్లేదు. టీమిండియా గ్రేట్స్ రోహిత్ శర్మ, ధోనీ, యువరాజ్, సెహ్వాగ్ లాంటి వాళ్లు ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంఛైజీలకు ఆడారు. కానీ కోహ్లి మాత్రం తొలి సీజన్ నుంచీ ఇప్పుడు 2024 వరకూ ఆర్సీబీతోనే ఉండటం గమనార్హం. ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ కోహ్లియే.
కేజీఎఫ్ స్టైల్లో విషెస్
16 ఏళ్లుగా తమ ఫ్రాంఛైజీకి ఎంతో నమ్మకంగా ఉన్న విరాట్ కోహ్లికి ఆర్సీబీ కేజీఎఫ్ స్టైల్లో విషెస్ చెప్పింది. అతడు జట్టులోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఉన్న అత్యుత్తమ క్షణాలను ఓ వీడియోగా రూపొందించి బ్యాక్‌గ్రౌండ్లో కేజీఎఫ్ మ్యూజిక్ యాడ్ చేశారు. "అన్నింటి కంటే నమ్మకమే గొప్పది. కింగ్ కోహ్లి, నువ్వంటే మాకు ఇష్టం" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఆర్సీబీ షేర్ చేసింది.
ఆర్సీబీతో కోహ్లి ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. అతడు జట్టులోకి అడుగుపెట్టే సమయానికి అప్పటికే క్రికెట్ లో దిగ్గజాలుగా పేరున్న అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, జాక్ కలిస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ల మధ్యలో తనను తాను నిరూపించుకొని 2013లో తొలిసారి కెప్టెన్ అయ్యాడు. 2016లో తన జట్టును ఫైనల్ తీసుకెళ్లడమే కాదు.. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు రికార్డు కూడా అందుకున్నాడు.
ఆ సీజన్లో కోహ్లి ఏకంగా 973 రన్స్ చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అయినా ఫైనల్లో సన్ రైజర్స్ చేతుల్లో ఆర్సీబీ ఓడిపోయింది. ఆర్సీబీ తరఫున 237 ఐపీఎల్ మ్యాచ్ లలో కోహ్లి 7263 రన్స్ చేశాడు. అందులో 7 సెంచరీలు ఉన్నాయి. ఎనిమిదేళ్ల పాటు కెప్టెన్ గా ఉండి.. 2021 సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తన జట్టుకు టైటిల్ సాధించిపెట్టలేకపోయానన్న వెలితి మాత్రం కోహ్లికి అలాగే ఉండిపోయింది.
ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్లో మరోసారి ఆర్సీబీ తరఫున కోహ్లి ఆడబోతున్నాడు. ఈ మధ్యే అతనికి కొడుకు పుట్టడంతో ఇంగ్లండ్ తో సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ తో మరోసారి ఫీల్డ్ లోకి అడుగుపెట్టనున్నాడు. మరి ఈసారైనా ఆర్సీబీకి టైటిల్ అందించాలన్న అతని కల నెరవేరుతుందేమో చూడాలి.