Virat Kohli: ఈ ఏడాది ఐపీఎల్‍లో విరాట్ కోహ్లీ ఆడతాడా? హింట్ ఇచ్చిన ఏబీ డెవిలియర్స్
Virat Kohli - IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్‍లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనే టెన్షన్ అందరిలో నెలకొంది. అయితే, ఈ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, కోహ్లీ సన్నిహితుడు ఏబీ డెవిలియర్స్ ఓ హింట్ ఇచ్చాడు.
Virat Kohli: స్వదేశంలో ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అయితే, అతడు ఎందుకు వైదొలిగాడో మొదట్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, అతడు రెండో సంతానాన్ని పొందనుండటంతో క్రికెట్‍కు బ్రేక్ తీసుకున్నాడని ఆ తర్వాత తెలిసింది. విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఐదు రోజుల తర్వాత వారు ప్రకటించారు. అయితే, ఇంగ్లండ్‍తో ఆ తర్వాత టెస్టులకు కూడా కోహ్లీ అందుబాటులోకి రాలేదు. దీంతో మార్చి 22న మొదలుకానున్న ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో కోహ్లీ ఆడతాడా లేదా అనే టెన్షన్ నెలకొంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు విరాట్ కోహ్లీనే ప్రధానమైన ఆటగాడిగా ఉన్నాడు. అయితే, కోహ్లీ ఐపీఎల్ కూడా ఆడడేమో అంటూ భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇటీవల ఓ కామెంట్ చేయడంతో సందిగ్ధత ఏర్పడింది. ఇందుకు సంబంధించిన విషయంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డెవిలియర్స్‌కు తాజాగా ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ఏడాది ఐపీఎల్‍లో ఆర్సీబీ గురించి తన యూట్యూబ్ ఛానెల్‍లో ఏబీకి క్వశ్చన్ వచ్చింది. దీంతో అతడు స్పందించాడు. ఐపీఎల్ 2024లో కోహ్లీ ఆడతాడనేలా అతడు హింట్ ఇచ్చాడు.
'ఐపీఎల్ 2024లో ఆర్సీబీ జట్టుతో మీరు కనిపిస్తారా' అని అడిగిన ప్రశ్నకు ఏబీ డెవిలియర్స్ ఆన్సర్ చెప్పాడు. ఆ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదని అన్నాడు. అయితే, తనను కలవాలని అనుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ చెప్పాడని ఏబీ తెలిపాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‍లో కోహ్లీ ఆడతాడని పరోక్షంగా హింట్ ఇచ్చాడు ఏబీ. “తనతో పాటు కొందరు బ్యాటర్లతో నేను సమయం గడపాలని కోరుతున్నట్టు విరాట్ కోహ్లీ చెప్పాడు. అయితే, ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. ఆండీ ఫ్లవర్, ఫాఫ్ డుప్లెసిస్ నుంచి నాకు పిలుపు రావాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నా” అని డెవిలియర్స్ చెప్పాడు.
ఇండియాకు వస్తా
ఐపీఎల్ 2024 కోసం తాను ఇండియాకు వస్తానని ఏబీ డెవిలియర్స్ స్పష్టం చేశాడు. “ఐపీఎల్ తొలి వారాల కోసం నేను ముంబైకు వెళతాను. కాస్త కామెంటరీ చేస్తా. మా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఆ తర్వాత నాకౌట్‍లకు మళ్లీ తిరిగి వస్తా” అని ఏబీడీ చెప్పాడు.
ఐపీఎల్‍లో ఆర్సీబీ తరఫున 11ఏళ్ల పాటు ఆడాడు ఏబీ డెవిలియర్స్. ఆ కాలంలో కోహ్లీ, ఏబీడీ మధ్య స్నేహం బాగా పెరిగింది. 2021 సీజన్ తర్వాత ఐపీఎల్‍కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డెవిలియర్స్. అయితే, ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతడిని బ్యాటింగ్ కోచ్‍గా తీసువాలని ఆర్సీబీ భావిస్తున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ విషయంపైనే ఇంకా ఏదీ కన్ఫార్మ్ కాలేదని ఏబీడీ చెప్పాడు.
మార్చి 22న షురూ
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ముందుగా 15 రోజుల పాటు 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను వెల్లడించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో అందుకు అనుగుణంగా తర్వాతి మ్యాచ్‍ల షెడ్యూల్‍ను త్వరలోనే ప్రకటించనుంది.