2 IPL Seasons: ఏడాదిలో రెండుసార్లు ఐపీఎల్.. టీ10 ఫార్మాట్లో రెండో సీజన్.. అభిమానులకు పండగే!-ipl 2 times a year t10 format in discussion bcci considering conducting two ipl season a year ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  2 Ipl Seasons: ఏడాదిలో రెండుసార్లు ఐపీఎల్.. టీ10 ఫార్మాట్లో రెండో సీజన్.. అభిమానులకు పండగే!

2 IPL Seasons: ఏడాదిలో రెండుసార్లు ఐపీఎల్.. టీ10 ఫార్మాట్లో రెండో సీజన్.. అభిమానులకు పండగే!

Hari Prasad S HT Telugu
Mar 11, 2024 12:55 PM IST

2 IPL Seasons: ఐపీఎల్ అభిమానులకు పండగలాంటి వార్తే ఇది. ఏడాదిలో రెండుసార్లు ఐపీఎల్ నిర్వహించే ప్రతిపాదనను ఇప్పటికీ బీసీసీఐ పరిశీలిస్తూనే ఉంది. అందులోనూ రెండో సీజన్ ను టీ10 ఫార్మాట్లో నిర్వహించే అవకాశం కూడా ఉంది.

ఏడాదిలో రెండుసార్లు ఐపీఎల్.. టీ10 ఫార్మాట్లో రెండో సీజన్.. అభిమానులకు పండగే!
ఏడాదిలో రెండుసార్లు ఐపీఎల్.. టీ10 ఫార్మాట్లో రెండో సీజన్.. అభిమానులకు పండగే! (IPL)

2 IPL Seasons: ఏడాదిలో రెండుసార్లు ఐపీఎల్.. ఇది నిజానికి గతంలో ఒకసారి వచ్చిన ప్రతిపాదనే. అయితే దీనిని బీసీసీఐ ఇప్పటికీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్.. టెలిగ్రాఫ్ తో చెప్పినదానిని బట్టి చూస్తే ఈ మెగా లీగ్ ను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఏడాదిలో రెండు ఐపీఎల్ సీజన్లు

ఏడాదిలో రెండు ఐపీఎల్ సీజన్లు నిర్వహిస్తే బాగుంటుందన్నది టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచి వచ్చిన ఆలోచన. అవసరమైతే ద్వైపాక్షిక సిరీస్ లను తగ్గించేసి ఐపీఎల్ మినీ సీజన్ పెట్టాలని అతడు డిమాండ్ చేశాడు. ఈ లీగ్ కు, ఫార్మాట్ కు మంచి డిమాండ్ ఉందని, అందుకే ఐపీఎల్ రెండో సీజన్ పై ఆలోచన చేస్తే బాగుంటుందని శాస్త్రి గతంలో అభిప్రాయపడ్డాడు.

ఇప్పుడు బీసీసీఐ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కామెంట్స్ ను బట్టి అర్థమవుతోంది. అయితే రెండో సీజన్ కోసం అవసరమైన సమయం ఏడాదిలో ఎప్పుడు దొరుకుతుందన్న దిశగా పరిశీలన చేస్తోంది. "మొదట 84 మ్యాచ్ లకు ఆ తర్వాత 94 మ్యాచ్ లకు మేము తగిన సమయం దొరుకుతుందేమో చూడాలి" అని టెలిగ్రాఫ్ తో అరుణ్ ధుమాల్ అన్నారు.

క్రికెట్ కు మరింత క్రేజ్ పెరగాలంటే ఐపీఎల్ రెండో సీజన్ అవసరమన్న భావనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండో సీజన్ వల్ల ఆట విలువ మరింత పెరుగుతుందని ధుమాల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రతి ఏటా సమ్మర్ లో ఐపీఎల్ కోసం సుమారు రెండు నెలల సమయం కేటాయిస్తున్నారు. ఆ స్థాయిలో ఏడాదిలో మరోసారి సమయం దొరకడం అంత సులువు కాదు.

టీ10 ఫార్మాట్‌లో ఐపీఎల్?

ఇక ఐపీఎల్ రెండో సీజన్ టీ10 ఫార్మాట్లో నిర్వహించే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో ఈ మెగా లీగ్ జరుగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా టీ10 ఫార్మాట్ కు కూడా క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. దీనివల్ల మ్యాచ్ లు కూడా త్వరగా ముగుస్తాయి. దీంతో ఐపీఎల్ రెండో సీజన్ ను త్వరగా ముగించడానికి ఈ ఫార్మాట్ ఉపయోగపడుతుంది.

అయితే రెండో సీజన్ కోసం ఫార్మాట్ పై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కూడా అరుణ్ ధుమాల్ చెప్పారు. దీనిపై ఇప్పటి వరకూ చర్చలు కూడా జరగలేదని తెలిపారు. క్రికెట్ కు మేలు చేసేలా కీలక నిర్ణయాలపై భవిష్యత్తులో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.

ప్లేయర్స్, ఫ్యాన్స్ సంగతేంటి?

ఐపీఎల్ రెండో సీజన్ పై నిర్ణయం తీసుకునే ముందు ప్లేయర్స్, ఫ్యాన్స్ ఆలోచన ఎలా ఉందన్నదానినీ పరిగణనలోకి తీసుకుంటామని అరుణ్ ధుమాల్ తెలిపారు. ఐపీఎల్ రెండో సీజన్ ను కూడా అభిమానులు అంతే ఉత్సాహం చూస్తారా అన్నది కూడా పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఇక ప్లేయర్స్ క్లబ్ క్రికెట్ వైపు మొగ్గు చూపినా.. దీని కారణంగా వాళ్ల జాతీయ జట్లపై పడే ప్రతికూల ప్రభావాన్ని కూడా మరచిపోకూడదు.

ప్రపంచంలో ఐపీఎల్ లాంటి ఎన్నో క్రికెట్ లీగ్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఈ మెగా లీగ్ కు ఉన్నంత ఆదరణ మాత్రం వాటికి లేదు. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. ఇందులో ఆడే ప్లేయర్స్ పై కోట్ల వర్షం కురుస్తోంది. దీంతో ఐపీఎల్ రెండో సీజన్ పెట్టినా ప్లేయర్స్ మాత్రం వెనుకాడకపోవచ్చు.

Whats_app_banner