ISPL 2024: హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు ఓనర్‌గా రామ్ చరణ్.. టీ10 ఫార్మాట్‌లో ఐఎస్‌పీఎల్
Ram Charan ISPL Hyderabad Team: రామ్ చరణ్ తాజాగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు యజమాని అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లీగ్ ప్రారంభం వంటి పూర్తి వివరాల్లోకి వెళితే..
Indian Street Premier League: చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ RRR మూవీతో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. సినిమాలతోపాటు వ్యాపారంలోనూ రాణిస్తున్న రామ్ చరణ్ తాజాగా ఓ క్రికెట్ లీగ్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఇండియన్ స్ట్రీట్ క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌కు యజమాని అయ్యాడు చెర్రీ.
ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించాడు. "ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, గల్లీ క్రికెట్‌ను, సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వెంచర్ ఉపయోగపడుతుంది. ఐఎస్‌పీఎల్‌లో హైదరాబాద్ జట్టును మెరుగుపరుస్తూ చిరస్మరణీయ క్షణాలను ఆస్వాదించడానికి నాతో భాగం పంచుకోండి" అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.
ఐఎస్‌పీఎల్ అంటే ఐపీఎల్ కాదు. ఇదొక గల్లీ క్రికెట్ లీగ్. గల్లీ క్రికెటర్లలోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ లీగ్ ఉపయోగపడనుంది. ఇది టీ10 ఫార్మాట్‌లో జరిగే టెన్నిస్ క్రికెట్ లీగ్. ఈ లీగ్ ద్వారా యంగ్ క్రికెటర్ల టాలెంట్ బయటకు తీసి భావి క్రికెట్ సూపర్ స్టార్స్‌గా తీర్చిదిద్దనున్నారు. అలాగే నగరాల్లో ఆటకు సంబంధించిన సుదుపాయాలను మెరుగుపరుస్తారు. 2024 మార్చి 2 నుంచి 9 వరకు ఈ ఐఎస్‌పీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
గల్లీ క్రికెట్‌కు, స్టేడియంలో జరిగే ప్రొఫెషనల్ ఆటకు మధ్య ఉన్న గ్యాప్ పూడ్చేందుకు ఐఎస్‌పీఎల్ కట్టుబడి ఉందని వెబ్‌సైట్‌లో వెల్లడించారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెటర్స్ ఈ లీగ్ సెలక్షన్స్‌లో పాల్గొనొచ్చు. అందుకు www.ispl-t10.com వెబ్‌సైట్‌లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి రూ. 1179ని 18 శాతం జీఎస్టీతో కలిపి చెల్లించడం ద్వారా రిజిస్టర్ అవుతారు.
అయితే, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ జట్టుకు రామ్ చరణ్ ఓనర్ కాగా.. ముంబై టీమ్‌కు అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ టీమ్‌కు అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్ యజమానులు కావడం విశేషం.