Yashasvi Jaiswal: ఒకప్పుడు టెంట్ కింద - ఇప్పుడు ఐదు కోట్లతో అపార్ట్ మెంట్ కొన్న యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రాణిస్తోన్న టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ .538 కోట్లతో ముంబయిలో ఓ లగ్జరీ అపార్టెమంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ అదరగొడుతోన్నాడు. రెండు డబుల్ సెంచరీలతో టీమిండియాకు అద్భుతమైన విజయాల్ని అందించాడు. మెరుపు బ్యాటింగ్‌తో యశస్వి పేరు క్రికెట్ వర్గాల్లో మారుమోగుతోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 435 పరుగులతో టాప్ స్కోరర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 284 పరుగులతో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ రెండో స్థానంలో ఉన్నాడు. 240 రన్స్‌తో రోహాత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతోన్నాడు. పరుగుల పరంగా ఎవరికి అందనంత ఎత్తులో యశస్వి ఉన్నాడు.
ఐదు కోట్లతో అపార్ట్‌మెంట్…
యశస్వి జైస్వాల్ ఇటీవలే 5.38 కోట్లతో ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. 1110 స్వ్కేర్ ఫీట్స్‌తో బంద్రా ఈస్ట్ ఏరియాలోని రిచెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో యశస్వి జైస్వాల్ అపార్ట్‌మెంట్ ఉందని సమాచారం. జనవరిలో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు సమాచారం. 5.38 కోట్లతో కొన్న ఈ అపార్ట్‌మెంట్‌లోకి త్వరలోనే యశస్వి జైస్వాల్ షిఫ్ట్ కాబోతున్నట్లు తెలిసింది.
ఒకప్పుడు టెంట్ కింద...
క్రికెటర్‌గా మారే క్రమంలో యశస్వి జైస్వాల్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. బదోనీలో పుట్టిన యశస్వి జైస్వాల్ క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకోవడం కోసం ముంబయి వచ్చాడు. క్రికెట్ శిక్షణ కోసం టెంట్ కింద చాలా రోజులు జీవితాన్ని వెళ్లదీశాడు. ఎన్ని కష్టాలు ఎదుర్కొని క్రికెటర్‌గా రాణించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. టెంట్ కింద జీవితాన్ని వెళ్లదీసిన రోజుల నుంచి ఇప్పుడు ఏకంగా ఐదు కోట్లతో అపార్ట్‌మెంట్ కొనే స్థాయికి యశస్వి జైస్వాల్ చేరుకున్నాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో...
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన యశస్వి జైస్వాల్ తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పధ్నాలుగు స్థానాలు ఎగబాకాడు. 15వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ల పరంగా కెరీర్‌లో అతడికి ఇదే బెస్ట్ ర్యాంక్ కావడం గమనార్హం. తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో కోహ్లి ఏడో ర్యాంకులో కొనసాగుతోన్నాడు. రోహిత్ శర్మ 12, రిషబ్ పంత్ 14వ స్థానాల్లో కొనసాగుతోన్నారు. వారి తర్వాత టీమిండియా తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్ కలిగిన క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ కొనసాగుతోన్నాడు.
నాలుగో టెస్ట్
ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానుంది. ఈ టెస్ట్‌లో బ్యాటింగ్ పరంగా టీమిండియాకు యశస్వి కీలకంగా నిలవబోతున్నాడు. నాలుగో టెస్ట్‌లో పలు రికార్డులపై యశస్వి కన్నేశాడు. ప్రస్తుతం 7 టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 861 రన్స్ చేశాడు. మరో 139 రన్స్ చేస్తే టెస్టుల్లో వేగంగా 1000 పరుగుల్ని పూర్తిచేసుకున్న ఇండియన్ క్రికెటర్‌గా జైస్వాల్ నిలుస్తాడు. ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు జైస్వాల్. మరో డబుల్ సెంచరీ చేస్తే వరుసగా మూడు టెస్టుల్లో మూడు డబుల్ సెంచీరలు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలుస్తాడు.
కాగా మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1తో టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా ఈ టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లితో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ దూరమయ్యారు.