Sanju Samson Records: భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. 17ఏళ్లుగా రోహిత్, కోహ్లీకి సాధ్యంకాని రికార్డ్‌ని అలవోకగా
India vs South Africa 1st T20: సంజు శాంసన్ 2015 నుంచి అంతర్జాతీయ టీ20ల్లో ఆడుతున్నాడు. కానీ.. మొన్నటి వరకు టీ20 జట్టులో అతనికి అవమానాలే. ఎన్నో మ్యాచ్‌ల్లో అతనిపై వేటు పడింది. అయితే.. నెల రోజుల వ్యవధిలో 17 ఏళ్లుగా ఏ భారత క్రికెటర్‌కీ సాధ్యంకాని రికార్డ్‌ని నెలకొల్పాడు.
సంజు శాంసన్.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీ బాదిన సంజు శాంసన్.. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ శతకం బాదేశాడు.
మ్యాచ్‌లో కేవలం 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు బాదిన సంజు శాంసన్ 107 పరుగులు చేశాడు. దాంతో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 202 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 17.5 ఓవర్లలోనే 141 పరుగులకి ఆలౌటైంది. ఇక రెండో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకి జరగనుంది.
స్పిన్నర్‌కి ఒకలా.. పేసర్‌కి మరోలా ట్రీట్‌మెంట్
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సంజు శాంసన్.. దక్షిణాఫ్రికా టీమ్‌లోని ఏ బౌలర్‌నీ వదల్లేదు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్లు ఆడిన సంజూ.. పేసర్ల బౌలింగ్‌లో వారి తలమీదుగానే నేరుగా బంతిని స్టాండ్స్‌లోకి కొట్టాడు.
సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం ఇంత సులువా? అనేలా సంజు శాంసన్ విధ్వంసం కొనసాగింది. ఒకానొక దశలో సంజు శాంసన్‌ని నిలువరించడం ఎలానో తెలియక.. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ తలపట్టుకున్నాడు. మ్యాచ్‌లో 214.00 స్ట్రైక్‌రేట్‌తో సంజు బ్యాటింగ్ చేయడం గమనార్హం.
భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
భారత జట్టు 2006-07 నుంచి అంతర్జాతీయ టీ20ల్లో ఆడుతుండగా.. ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్ కూడా బ్యాట్ టు బ్యాక్ ఇంటర్నేషనల్ టీ20ల్లో సెంచరీ సాధించలేకపోయారు. కానీ సంజు శాంసన్ అలవోకగా.. మొన్న బంగ్లాదేశ్‌పై నేడు దక్షిణాఫ్రికాపై సెంచరీ బాదేసి.. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇంగ్లాండ్‌కి చెందిన ఫిల్ సాల్ట్, దక్షిణాఫ్రికా టీమ్‌కి చెందిన రిలీ రొసౌ, ఫ్రాన్స్ ప్లేయర్ మెకియాన్ మాత్రమే ఇలా అంతర్జాతీయ టీ20ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేయగలిగారు. దాంతో సంజు శాంసన్ సగర్వంగా ఈ జాబితాలో చేరిపోయాడు.
సూర్య రికార్డ్ కూడా కనుమరుగు
దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో సంజు శాంసన్ కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేసి.. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికాపై ఇప్పటి వరకూ వేగంగా సెంచరీ నమోదు చేసిన భారత క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సూర్య గతంలో దక్షిణాఫ్రికాపై 55 బంతుల్లో సెంచరీ నమోదు చేయగా.. సంజు శాంసన్ 47 బంతుల్లోనే శతకం బాదేసి ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఖుష్
ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట సంజు శాంసన్‌ని రూ.18 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రిటెన్ చేసుకుంది. ఈ నెల 24, 25న ఐపీఎల్ 2025 వేలం జరగనుండగా.. కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్‌తో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఫుల్ ఖుష్‌గా కనిపిస్తోంది. ఒకవేళ సంజూని రిటెన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసి ఉంటే.. రాజస్థాన్ ఫ్రాంఛైజీ ఇప్పుడు బాధపడాల్సి వచ్చేది.