Sanju Samson 5 Sixes: సంజు శాంసన్ ఒకే ఓవర్‌లో 6,6,6,6,6.. మిగిలిన ఒక్క బంతి ఎలా మిస్ అయ్యిందంటే?-india wicketkeeper batter sanju samson goes berserk with 5 sixes in an over vs bangladesh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sanju Samson 5 Sixes: సంజు శాంసన్ ఒకే ఓవర్‌లో 6,6,6,6,6.. మిగిలిన ఒక్క బంతి ఎలా మిస్ అయ్యిందంటే?

Sanju Samson 5 Sixes: సంజు శాంసన్ ఒకే ఓవర్‌లో 6,6,6,6,6.. మిగిలిన ఒక్క బంతి ఎలా మిస్ అయ్యిందంటే?

Galeti Rajendra HT Telugu
Oct 13, 2024 06:24 AM IST

Sanju Samson 5 Sixes In An Over: హైదరాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బంగ్లాదేశ్ స్పిన్నర్ రషీద్‌కి టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ చుక్కలు చూపించేశాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదేసి 30 పరుగులు రాబట్టాడు.

సంజు శాంసన్ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు
సంజు శాంసన్ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు (AFP)

భారత జట్టు సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ చాలా కాలంగా భారత జట్టుకు ఆడుతున్నాడు. కానీ పేలవమైన ఫామ్, గాయాలు, నిర్లక్ష్యం కారణంగా అతనికి కెరీర్‌లో ఒడిదొడుకులు తప్పలేదు. 2015లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్‌.. ఈ 9 ఏళ్ల నుంచి టీమ్‌లో చోటు పదిలం చేసుకోవడానికి శ్రమిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్నో సందర్భాల్లో జట్టు నుంచి తొలగింపు అవమానాల్ని ఎదుర్కొన్నాడు. చాలా మ్యాచ్‌ల్లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు.

విమర్శకులకి సెంచరీతో సమాధానం

బంగ్లాదేశ్‌తో శనివారం రాత్రి ముగిసిన టీ20 సిరీస్‌లోనూ సంజు శాంసన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలవగానే.. అతనిపై వేటు వేయాలని భారీగా డిమాండ్స్ వినిపించాయి. టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చింది.

మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన సంజు శాంసన్ కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదేసి 111 పరుగులు చేశాడు. సుదీర్ఘ టీ20 కెరీర్‌లో సంజు శాంసన్‌కి ఇదే తొలి సెంచరీ. సెంచరీ సాధించే క్రమంలో సంజు శాంసన్ ఒకే ఓవర్‌లో వరుసగా 6,6,6,6,6 బాదేశాడు.

ఆ ఒక్క బంతి ఎలా మిస్సయ్యింది?

ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన స్పిన్నర్ రషీద్ బౌలింగ్‌లో రెండో బంతిని అతని తలమీదుగా సిక్స్‌గా కొట్టిన సంజు శాంసన్, మూడో బంతిని లాంగాఫ్ దిశగా, నాలుగో బంతిని మళ్లీ బౌలర్ తలమీదుగా, ఐదో బంతిని మళ్లీ లాంగాన్‌లో, ఆఖరి బంతిని మిడ్ వికెట్‌ దిశగా సిక్సర్ల రూపంలో తరలించేశాడు. దెబ్బకి ఆ ఓవర్‌లో వరుసగా 0,6,6,6,6,6 రూపంలో 30 పరుగులు వచ్చాయి.

కానీ.. ఆ ఓవర్‌లో తొలి బంతిని మాత్రం సంజు శాంసన్ సిక్స్‌గా మలచలేకపోయాడు. రషీద్ లెగ్ సైడ్ వేసిన తొలి బంతిని కూడా సంజు హిట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. బంతి అతని బ్యాట్‌కి దొరక్కుండా నేరుగా ఫ్యాడ్స్‌ని తాకింది. దాంతో ఫస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టే ఛాన్స్ మిస్ అయ్యింది. లేకుంటే ఆరు బంతుల్లోనూ ఆరు సిక్సర్లు కొట్టాలనేది తన ప్లాన్ అని మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ వెల్లడించాడు.

చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా

మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ మాట్లాడుతూ ‘‘ చాలా సంతోషంగా ఉంది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి వస్తుంది. ఈ మ్యాచ్‌లో నేను మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను. అందుకే బేసిక్స్‌కు కట్టుబడి ఉండాలని బ్యాటింగ్ చేస్తున్నంతసేపు నాకు నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. గత సిరీస్‌లో రెండుసార్లు సున్నా వద్ద ఔటయ్యాను. అయినప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ నాకు సపోర్ట్ చేసింది’’ అని వెల్లడించాడు.

ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టడంపై మాట్లాడుతూ ‘‘ నేను దేశవాళీ క్రికెట్‌లో ఇలా కొట్టాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై అది సాధ్యమైంది’’ అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజుకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.

Whats_app_banner