Sunrisers Hyderabad: గెలవాలంటే ఇలా చేయండి.. సన్ రైజర్స్‌ కోసం కెప్టెన్ మార్‌క్రమ్ ప్లాన్-sunrisers hyderabad motivated by captain markram as he laid a two step process ahead of team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sunrisers Hyderabad: గెలవాలంటే ఇలా చేయండి.. సన్ రైజర్స్‌ కోసం కెప్టెన్ మార్‌క్రమ్ ప్లాన్

Sunrisers Hyderabad: గెలవాలంటే ఇలా చేయండి.. సన్ రైజర్స్‌ కోసం కెప్టెన్ మార్‌క్రమ్ ప్లాన్

Hari Prasad S HT Telugu
Apr 06, 2023 07:21 PM IST

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ను గాడిలో పెట్టడానికి కెప్టెన్ మార్‌క్రమ్ సూపర్ ప్లాన్ వేశాడు. దీని కోసం అతడు రెండు దశలను ప్లేయర్స్ కు వివరించాడు. ఈ వీడియోను సన్ రైజర్స్ గురువారం (ఏప్రిల్ 6) రిలీజ్ చేసింది.

సన్ రైజర్స్ టీమ్ తో కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్
సన్ రైజర్స్ టీమ్ తో కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్

Sunrisers Hyderabad: ఐపీఎల్ 16వ సీజన్ ను దారుణంగా మొదలుపెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఏకంగా 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్ కు మిస్ అయిన కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ ఇప్పుడు వచ్చేశాడు. అతనితోపాటు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్స్ క్లాసెన్, మార్కో జాన్సన్ కూడా జట్టుతో చేరారు.

దీంతో సన్ రైజర్స్ కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. ఇక మార్‌క్రమ్ వచ్చీ రాగానే జట్టును గాడిలో పెట్టే పని మొదలుపెట్టాడు. గురువారం (ఏప్రిల్ 6) టీమ్ తో మాట్లాడిన అతడు.. దీనికోసం రెండు పనులు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ముందుగా కండిషన్స్ ను సాధ్యమైనంత త్వరగా అర్థం చేసుకోవడం, ఆ తర్వాత వాటికి తగినట్లు తమ బలాల ఆధారంగా స్వేచ్ఛగా ఆడటం ముఖ్యమని అతడు అన్నాడు.

ప్రతి ప్లేయర్ తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలని, అందులో ఏదైనా తప్పు జరిగినా ఎవరూ ప్రశ్నించకుండా తగిన స్వేచ్ఛ టీమ్ లో ఎప్పుడూ ఉంటుందని కూడా మార్‌క్రమ్ వారికి భరోసా కల్పించాడు. ప్రతి ఒక్కరూ తమ బలాలకు అనుగుణంగా ఆడాలని, ఈ జట్టులో నాణ్యతకు కొదవ లేదని ప్లేయర్స్ లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాడు.

ఇక సన్ రైజర్స్ ఫీల్డింగ్ చాలా బాగుందని ఈ సందర్భంగా అతడు అన్నాడు. గత సీజన్ లో విలియమ్సన్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ దారుణమైన ప్రదర్శన చేసింది. పాయింట్ల టేబుల్లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి కూడా తొలి మ్యాచ్ లో దారుణమైన ఓటమితో ప్రస్తుతం టేబుల్లో అట్టడుగున ఉంది.

అయితే సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ వన్డే సిరీస్ కోసం తొలి మ్యాచ్ కు దూరమైన కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ లు.. ఇప్పుడు జట్టుతో చేరారు. దీంతో టీమ్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మార్‌క్రమ్ కెప్టెన్సీలోనే సౌతాఫ్రికాలో లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్స్ విజేతగా నిలిచింది. దీంతో ఐపీఎల్లోనూ అతనిపై సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ భారీ ఆశలే పెట్టుకుంది.

Whats_app_banner