Aiden Markram on SRH Captaincy: ఆ ఇద్దరి నుంచే కెప్టెన్సీ పాఠాలు నేర్చుకున్నా: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ మార్‌క్రమ్
Aiden Markram on SRH Captaincy: ఆ ఇద్దరి నుంచే కెప్టెన్సీ పాఠాలు నేర్చుకున్నానని చెప్పాడు సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్. సౌతాఫ్రికా లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్ కేప్ టీమ్ కు టైటిల్ సాధించి పెట్టిన అతడు.. ఇప్పుడు హైదరాబాద్ టీమ్ కు ఆశలు రేపుతున్నాడు.
Aiden Markram on SRH Captaincy: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్సీ సౌతాఫ్రికా బ్యాటర్ ఏడెన్ మార్‌క్రమ్ కు దక్కిన విషయం తెలుసు కదా. గత సీజన్ లో కేన్ విలియమ్సన్ దగ్గర ఉన్న కెప్టెన్సీ ఇప్పుడు మార్‌క్రమ్ కు దక్కింది. సౌతాఫ్రికా లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ కు టైటిల్ సాధించి పెట్టిన అతడు.. ఇప్పుడు ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ను కూడా విజేతగా నిలబెడతానన్న నమ్మకంతో ఉన్నాడు.
ఈ సందర్భంగా ఇండియా టుడేతో మాట్లాడిన మార్‌క్రమ్.. తాను డుప్లెస్సి, కేన్ విలియమ్సన్ ల నుంచి కెప్టెన్సీ పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పాడు. "నాపై ఉన్న బాధ్యత గురించి చెప్పాలంటే నేను దానిని ఎంజాయ్ చేస్తాను. ఓ స్పోర్ట్స్ మ్యాన్ గా ఎప్పుడూ గెలవాలనే అనుకుంటాం. కెప్టెన్ అయిన తర్వాత ఇది మరింత పెరుగుతుంది. టీమ్ బాగా ఆడి అభిమానులు సంతృప్తి చెందాలని అనుకుంటాం. మనం చేయగలిగింది చేస్తాం. వర్కౌట్ అయితే ఓకే. లేదంటే అది ఆటలో భాగం" అని మార్‌క్రమ్ అన్నాడు.
గత రెండు సీజన్లుగా మార్‌క్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో ఉన్నాడు. గత సీజన్ లో 381 రన్స్ తో రాణించాడు. "నాకు ఆదర్శప్రాయులైన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే.. నేషనల్ టీమ్ కు ఆడినప్పుడు ఫాఫ్ డుప్లెస్సి నుంచి నేర్చుకున్నాను. నాయకత్వంపై అతడు నా కళ్లు తెరిపించాడు. ఇక సన్ రైజర్స్ కు ఆడినప్పుడు కేన్ కూడా అంతే. కామ్ గా ఉండటం, ప్లేయర్స్ కు మద్దతుగా నిలవడంలో అతడు కూడా అచ్చూ ఫాఫ్ లాగే ఉంటాడు. అందుకే ఈ ఇద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను" అని మార్‌క్రమ్ చెప్పాడు.
ఇక వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాతో కలిసి పని చేయనుండటం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ప్రస్తుతం లారా టీమ్ హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే వారం నుంచే రానున్న సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ రోడ్ మ్యాప్ పై చర్చించాలని తాము నిర్ణయించినట్లు మార్‌క్రమ్ తెలిపాడు. అంతేకాదు సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్ట్ సందర్భంగానే లారాను కలవనున్నట్లు కూడా చెప్పాడు.
మార్చి 31న నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ తన తొలి మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ లో ఆడనుంది. ఈ సీజన్ లో మరోసారి మ్యాచ్ లు హోమ్, అవే పద్ధతిలో జరగనున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం