Sunrisers Hyderabad: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన క్లాసెన్: వైరల్ వీడియో చూసేయండి-sunrisers hyderabad star heinrich klaasen says ugadi wishes in telugu video goes viral ahead of srh vs pbks clash ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన క్లాసెన్: వైరల్ వీడియో చూసేయండి

Sunrisers Hyderabad: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన క్లాసెన్: వైరల్ వీడియో చూసేయండి

Sunrisers Hyderabad - Heinrich Klaasen: సన్‍రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్.. తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. మరికొందరు ప్లేయర్లు కూడా విషెస్ చెప్పారు.

Sunrisers Hyderabad: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన క్లాసెన్: వైరల్ వీడియో చూసేయండి (ANI )

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ రాణిస్తోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‍ల్లో రెండింట గెలిచింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి బలమైన జట్లపై భారీగా గెలిచి సత్తాచాటింది. నేడు (ఏప్రిల్ 9) ముల్లాన్‍పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో సన్‍రైజర్స్ తలపడనుంది. కాగా, నేడు ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు కొందరు ఎస్‍ఆర్‌హెచ్ ఆటగాళ్లు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఎస్‍ఆర్‌హెచ్ డ్యాషింగ్ బ్యాటర్, దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ తెలుగులో విషెస్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ధనాధన్ హిట్టింగ్‍తో మెరిపిస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‍ల్లోనే 200పైగా స్ట్రైక్‍రేట్‍తో 177 రన్స్ చేశాడు. క్లాసెన్ బ్యాటింగ్‍కు తెలుగు ప్రజల్లో ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. ఈ తరుణంలో ఉగాది సందర్భంగా నేడు తెలుగు వారికి తెలుగులోనే క్లాసెన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

నమస్కరిస్తూ..

‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని హెన్రిచ్ క్లాసెన్ చెప్పాడు. తెలుగు స్టైల్‍లో నమస్కారం చేసి విషెస్ తెలిపాడు. జియోసినిమా ఓటీటీ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‍గా మారింది. అయితే, తెలుగులో మాట్లాడేందుకు కాస్త తడబడ్డాడు క్లాసెన్. ఇది చెప్పేందుకు ఆయన కొన్ని టేక్స్ తీసుకున్నాడని వీడియోలో ఉంది. అయితే, మొత్తంగా చక్కగా తెలుగులో శుభాకాంక్షలు చెప్పి మెప్పించాడు క్లాసెన్.

క్లాసెన్ తెలుగులో విషెస్ చెప్పడంతో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఉగాది రోజున ఎక్కువ సిక్స్‌లు బాదాలని సూచిస్తున్నారు.

భువనేశ్వర్ కుమార్, ట్రావిస్ హెడ్, మార్కో జాన్సెన్, మయాంక్ అగర్వాల్ సహా మరికొందరు ఆటగాళ్లు హ్యాపీ ఉగాది చెప్పిన వీడియోను సన్‍రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, క్లాసెన్, మార్క్ రమ్, భువనేశ్వర్ కుమార్.. సంప్రదాయ దుస్తులు ధరించినట్టుగా ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది.

హైదరాబాద్ వర్సెస్ పంజాబ్

ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతాతో జరిగిన తన తొలి మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఆ తర్వాత హోం గ్రౌండ్ ఉప్పల్‍లో ముంబై ఇండియన్స్ జట్టుతో మ్యాచ్‍లో రికార్డులను బద్దలుకొట్టి గెలిచి బోణీ కొట్టింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు (277) రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత అహ్మదాబాద్‍లో గుజరాత్‍తో జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ ఓటమి పాలైంది. హోం గ్రౌండ్‍లో చెన్నైపై ఏకపక్షంగా గెలిచింది. ఇలా రెండు గెలుపులను హోం గ్రౌండ్‍లోనే కొట్టింది. నేడు పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్ ముల్లాన్‍పూర్‌లో ఎస్‍ఆర్‍హెచ్ ఆడనుంది. ఈ సీజన్‍లో అవే స్టేడియంలో తొలి గెలుపు సాధించాలని ఎస్‍ఆర్‌హెచ్ పట్టుదలగా ఉంది.

ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‍ల్లో పరస్పరం తలపడ్డాయి. వీటిలో 14సార్లు హైదరాబాద్ విజయం సాధించింది. 7సార్లు మాత్రమే పంజాబ్ గెలిచింది. హెడ్ టూ హెడ్ పరంగా చూసుకుంటే ఎస్‍ఆర్‌హెచ్ చాలా మెరుగ్గా ఉంది.