PBKS vs SRH: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఒకే స్పీడుతో వెళ్తున్నాయి. ఈ రెండు టీమ్స్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండేసి విజయాలు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో సన్ రైజర్స్ ఐదో స్థానంలో, పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో ఉన్నాయి. ఇప్పుడీ రెండు జట్ల మధ్య మొహాలీలో మంగళవారం (ఏప్రిల్ 9) కీలకమైన మ్యాచ్ జరగబోతోంది.
ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రెండు విజయాలు సొంత మైదానంలో వచ్చినవే. బయట ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. ఇప్పుడు మరోసారి పంజాబ్ కింగ్స్ తో వాళ్ల మైదానంలో తలపడబోతోంది. దీంతో ఆ టీమ్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో గెలిస్తే టాప్ 4లోకి దూసుకెళ్లే అవకాశం సన్ రైజర్స్ కు ఉంది.
గత రికార్డులు కూడా ఎస్ఆర్‌హెచ్ టీమ్ కు అనుకూలంగా ఉన్నాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు మొత్తం 21సార్లు తలపడగా.. అందులో 14 మ్యాచ్ లలో సన్ రైజర్స్, 7 మ్యాచ్ లలో పంజాబ్ కింగ్స్ గెలిచాయి. ఇక చివరి ఐదు మ్యాచ్ లలోనూ మనోళ్లదే పైచేయిగా ఉంది. వీటిలో మూడు మ్యాచ్ లలో సన్ రైజర్స్, రెండు మ్యాచ్ లలో పంజాబ్ గెలిచింది.
గతేడాది చివరిసారి తలపడగా.. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లతో విజయం సాధించింది. ఇక అంతకుముందు 2022లో రెండు మ్యాచ్ లలో ఆడగా.. పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ లో 5 వికెట్లతో, సన్ రైజర్స్ మరో మ్యాచ్ లో 7 వికెట్లతో గెలిచాయి. 2021 ఐపీఎల్లోనూ ఈ రెండు టీమ్స్ రెండుసార్లు ఆడగా.. పంజాబ్ కింగ్స్ 5 పరుగులతో ఒక మ్యాచ్ లో, సన్ రైజర్స్ 9 వికెట్లతో మరో మ్యాచ్ లో విజయం సాధించాయి.
అయితే ప్రస్తుత ఫామ్ చూస్తే రెండు టీమ్స్ సమవుజ్జీలుగా ఉన్నాయి. గత మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ మెరుపులు సన్ రైజర్స్ కు వార్నింగ్ అనే చెప్పాలి. అదే సమయంలో సన్ రైజర్స్ కూడా హెడ్, అభిషేక్ శర్మ, మార్‌క్రమ్, క్లాసెన్ లాంటి బ్యాటర్లతో పటిష్టంగా ఉంది. పైగా తమ చివరి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టి కరిపించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి ఈ రెండు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఏడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మయాంక్ మార్కండె
శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సామ్ కరన్, కగిసో రబాడా, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్