Kavya Maran: గతేడాది వరకు ట్రోల్స్.. ఇప్పుడు ప్రశంసలు
Kavya Maran - Sunrisers Hyderabad: సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‍పై గతేడాది వరకు చాలా ట్రోల్స్ వచ్చాయి. జట్టును కూడా సరిగా ఎంపిక చేసుకోవడం రాదంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతుంటంతో ఆమెపై ప్రశంసలు వస్తున్నాయి.
Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ సీఈవోగా కావ్య మారన్ 2018లో బాధ్యతలు తీసుకున్నారు. తన తండ్రి, సన్‍గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ నుంచి ఆమె ఆ బాధ్యతలను ఆరేళ్ల క్రితం పొందారు. అప్పటి నుంచి ఓనర్‌గా ఎస్‍ఆర్‌హెచ్ క్యాంప్‍లో యాక్టివ్‍గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కావ్య బాగా హైలైట్ అయ్యారు. అయితే, మూడేళ్లుగా సన్‍రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‍లో పేలవ ప్రదర్శన చేస్తుండటంతో కావ్య మారన్‍పై ట్రోల్స్ నడిచాయి. విమర్శలు వచ్చాయి. అయితే, ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో హైదరాబాద్ అద్భుతంగా ఆడుతుండటంతో కావ్య మారన్‍పై ప్రశంసలు వస్తున్నాయి. ఆ వివరాలివే..
భారీగా ట్రోల్స్
ఐపీఎల్‍లో 2021, 2022, 2023 సీజన్లలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. పేలవ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా టీమ్ కూర్పు సరిగా లేక ఇబ్బందులు పడింది. ఈ క్రమంలో వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోలేదంటూ కావ్య మారన్‍పై ట్రోల్స్ నడిచాయి. అలాగే, 2021 సీజన్‍లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి పక్కన కూర్చొబెట్టిన విషయంలో భారీగా విమర్శలు వచ్చాయి. 2016లో కెప్టెన్‍గా హైదరాబాద్ జట్టుకు టైటిల్ తెచ్చిపెట్టిన వార్నర్‌ను తొలగించడంపై అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత అతడు జట్టును వీడి ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్లాడు. వార్నర్ విషయంలో కావ్యపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
అలాగే, 2023 సీజన్ కోసం ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్‍ను రూ.13.25 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసిన విషయంపై కూడా కావ్యపై ట్రోల్స్ వచ్చాయి. గతంలో నికోలస్ పూరన్ సహా మరికొందరు ఆటగాళ్లను తీసుకోవడంపై విమర్శలను ఎదుర్కొన్నారు. వరుసగా మూడు సీజన్లలో హైదరాబాద్ విఫలమవటంతో చాలా మంది ఫ్యాన్స్ పలు విషయాల్లో జట్టు సీఈవో కావ్య మారన్‍పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. అయితే, ఐపీఎల్ 2024 సీజన్‍లో పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు ప్రశంసలు
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను వేలంలో రూ.20.50 కోట్ల భారీ ధరతో తీసుకున్నారు హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్. అతడిని టీమ్‍కు కెప్టెన్‍ను కూడా చేశారు. కమిన్స్‌కు అంత ధర ఎందుకంటూ కూడా మొదట్లో వాదనలు వినిపించాయి. అలాగే, 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‍ను రూ.6.8 కోట్లకు ఎస్‍ఆర్‌హెచ్ తీసుకుంది.
అయితే, ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా దూకుడుగా ఆడుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డును 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు సృష్టించింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా దూకుడు చూపిస్తోంది. కమిన్స్ కెప్టెన్సీతో పాటు బౌలింగ్‍లో దుమ్మురేపుతుంటే.. ట్రావిస్ హెడ్ ధనాధన్ బ్యాటింగ్‍తో రెచ్చిపోతున్నాడు. హెడ్ ఓ సెంచరీ కూడా బాదేశాడు. ఈ సీజన్ కోసం తీసుకున్న పేసర్ జయదేవ్ ఉనాద్కత్ కూడా రాణిస్తున్నాడు. మొత్తంగా ఈ సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది.
ప్రస్తుత సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతుంటంతో ఓనర్ కావ్య మారన్‍పై ప్రశంసలు వస్తున్నాయి. ఒకప్పుడు ట్రోల్స్ చేసిన నెటిజన్లు ఇప్పుడు ఆమె నిర్ణయాలను పొగుడుతున్నారు. ముఖ్యంగా భారీ ధర అయినా కమిన్స్‌ను పట్టుబట్టి తీసుకోవడాన్ని, ఐడెన్ మార్క్‌రమ్‍ను తప్పించి అతడిని కెప్టెన్‍ను చేయడంపై భేష్ అంటున్నారు. హెడ్‍ను విషయంలోనూ హ్యాట్యాఫ్ చెబుతున్నారు. మొత్తంగా.. గతేడాది వరకు ట్రోల్స్‌కు గురైన కావ్య మారన్.. ఎట్టకేలకు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచింది సన్‍రైజర్స్ హైదరాబాద్. పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్‍లో ఉంది. తదుపరి ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఎస్‍ఆర్‌హెచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.