Virat Kohli: ఇది ఆరంభం మాత్రమే...కోహ్లి ఫామ్‌పై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - డకౌట్స్‌లో విరాట్ చెత్త రికార్డ్
Virat Kohli: వరల్డ్ కప్‌లో కోహ్లి దారుణంగా విఫలమవుతోన్నాడు. మూడు మ్యాచుల్లో కలిపి కేవలం ఐదు రన్స్ మాత్రమే చేశాడు. కోహ్లి ఫామ్‌పై సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకొని సూపర్ 8లో అడుగుపెట్టింది. ఈ వరల్డ్ కప్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణిస్తోన్నారు. అయితే విరాట్ కోహ్లి ఫామ్ మాత్రం అభిమానులను కలవరపెడుతోంది. మూడు మ్యాచుల్లో కలిపి కోహ్లి కేవలం ఐదు పరుగుల మాత్రమే చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై నాలుగు పరుగులు చేసిన కోహ్లి అమెరికాపై తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన కోహ్లి కీలకమైన టీ20 వరల్డ్ కప్‌లో చేతులెత్తేయడం ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. అతడి బ్యాటింగ్ తీరుపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నాయి.
గవాస్కర్ సపోర్ట్...
అయితే టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం కోహ్లిని వెనకేసుకువచ్చాడు. కోహ్లి బ్యాటింగ్, ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సునీల్ గవాస్కర్ కామెంట్స్ చేశాడు.
మూడు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన కోహ్లి బ్యాటింగ్ బాగా లేదని అనుకోవడం కరెక్ట్ కాదని సునీల్ గవాస్కర్ అన్నాడు. కొన్నిసార్లు బౌలర్లు వేసే అద్భుతమైన బాల్స్‌కు ఔటవుతాం. ఆ తర్వాత మ్యాచుల్లో అలాంటి బాల్స్‌నే ఫోర్లుగా మలిచే ఛాన్స్‌లు ఉంటాయి. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. వరల్డ్ కప్‌లో మూడు దురదృష్టవశాత్తూ కోహ్లి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అంత మాత్రానా అతడిపై నమ్మకం కోల్పోవాల్సిన పనిలేదు. కోహ్లి ఫామ్‌లోకి వచ్చి బ్యాట్ ఝులిపించే రోజు తప్పకుండా వస్తుందని గవాస్కర్ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్ ఆరంభంలోనే ఉంది. ఇంకా సూపర్ 8, సెమీస్, ఫైనల్ ఇలా చాలానే ఉన్నాయి. ఓపిక, నమ్మకంతో ఎదురుచూస్తే తప్పకుండా కోహ్లి విశ్వరూపాన్ని వరల్డ్ కప్‌లో చూడొచ్చు అని గవాస్కర్ అన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో కోహ్లి ఓపెనర్‌గా బరిలో దిగుతోన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తోన్నాడు. ఓపెనింగ్ స్థానం అతడికి అంతగా కలిసి రావడం లేదు.
రోహిత్ తర్వాత కోహ్లి...
టీ20 వరల్డ్ కప్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్ ద్వారా కోహ్లి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన రెండో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 12 డక్స్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. అతడి తర్వాత ఆరు డక్‌లతో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. ఐదు డకౌట్స్‌తో కేఎల్ రాహుల్ మూడోస్థానంలో నిలిచాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో గోల్డెన్ డకౌట్ అయిన ఏడో క్రికెటర్‌గా అమెరికా మ్యాచ్‌తో కోహ్లి మరో చెత్త రికార్డును సృష్టించాడు. ఈ వరల్డ్ కప్‌లోనే కోహ్లితో పాటు జడేజా, బుమ్రా కూడా గోల్డెన్ డక్ ఔట్ అయ్యారు.
సూపర్ 8లో ఆస్ట్రేలియాతో...
అమెరికాపై విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది టీమిండియా. సూపర్ 8 తొలి పోరులో ఆస్ట్రేలియాతో జూన్ 24న తలపడనుంది. అంతకంటే ముందు లీగ్ స్టేజ్‌లో కెనడాతో టీమిండియా నామమాత్రమైన మ్యాచ్ ఆడనుంది.