Ranji Trophy Final: సచిన్ ముందే అతని రికార్డు బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్
Ranji Trophy Final: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముందే అతని రంజీ ట్రోఫీ రికార్డును సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ బ్రేక్ చేశాడు. మరోవైపు ఇదే ఫైనల్లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.
Ranji Trophy Final: అన్నకు తగిన తమ్ముడు అనిపించుకున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. అన్న సర్ఫరాజ్ ఖాన్ ఈ మధ్యే టీమిండియాలో అడుగుపెట్టి అద్భుతంగా రాణించగా.. ఇప్పుడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ స్టాండ్స్ లో ఉన్న సమయంలోనే ముషీర్ ముంబై తరఫున రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ యంగెస్ట్ బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
ముషీర్ ఖాన్ రికార్డు
ఇప్పటికే 41సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై టీమ్.. 42వసారి ట్రోఫీ గెలవడం ఖాయంగా మారింది. విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మూడో రోజు ముషీర్ ఖాన్ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ముంబై రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. ఇక ఇండియా టెస్ట్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు అయిన ముషీర్ ఖాన్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాదాడు.
రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ పేరిట 29 ఏళ్లుగా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 51 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన ముషీర్.. తర్వాత సెంచరీ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీ కూడా చేసిన విషయం తెలిసిందే. ఫైనల్లో సెంచరీతో ముషీర్ మరోసారి సత్తా చాటాడు.
రెండుసార్లు రంజీ ట్రోఫీ గెలిచిన టీమ్ లో సభ్యుడైన సచిన్ టెండూల్కర్.. 1994-95 ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సెంచరీ చేశాడు. ఇప్పుడు ముషీర్ ఖాన్ కేవలం 19 ఏళ్ల 14 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఆ సమయంలో సచిన్ గ్యాలరీలో ఉన్నాడు. శ్రేయస్ తో కలిసి ముషీర్ నాలుగో వికెట్ కు 168 పరుగులు జోడించాడు.
ముషీర్ ఖాన్ ఈ ఏడాది రంజీ ట్రోఫీలో టాప్ ఫామ్ లో ఉన్నాడు. తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు బరోడాతో క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఇక గత నెలలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లోనూ ముషీర్ రెండు సెంచరీలు సహా 360 రన్స్ చేశాడు.
ఫామ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్
ఇక టీమిండియాతోపాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నూ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. విదర్బతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో శ్రేయస్ హాఫ్ సెంచరీ చేశాడు. ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. శ్రేయస్ ఈ ఫైనల్లో 111 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ లతో 95 రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 7 పరుగులు చేసి నిరాశ పరిచిన శ్రేయస్.. రెండో ఇన్నింగ్స్ లో 95 రన్స్ చేశాడు.
ఇక రంజీ ట్రోఫీ ఫైనల్ చూడటానికి లెజెండరీ క్రికెటర్లు క్యూ కడుతున్నారు. సోమవారం రెండో రోజు సునీల్ గవాస్కర్ రాగా.. మంగళవారం (మార్చి 12) సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫైనల్ చూశారు.